Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గిరిజన సంఘం డిమాండ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
గిరిజనులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని తెలంగాణ గిరిజన సంఘం డిమాండ్ చేసింది. అదివారం బాగ్లింగంపల్లిలోని ఎస్వీకేలో గిరిజన సంఘం హైదరాబాద్ జిల్లా ఆరో మహాసభలు నిర్వహించారు. నేనావత్ రఘు నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎం.ధర్మ నాయక్. ఆర్.శ్రీరామ్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ గిరిజనులకు రాష్ట్ర వ్యాపితంగా గిరిజన బంధును ఏర్పాటు చేసి ఆదుకోవాలన్నారు. హైదరాబాద్లో నివసిస్తున్న గిరిజనులను ప్రభుత్వం గుర్తించి వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. గిరిజనులు అడ్డాల మీద కూలీలుగా, ఆటో రిక్షా కార్మికులుగా, చివరకు చెత్త కాగితాలు ఏరుకుని జీవిస్తూ కాలం వెళ్లదీస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బతుకమ్మ కుంట, బంజారా కాలనీ, అనేక గిరిజన బస్తీలలో అద్దె ఇండ్లలో ఉంటూ, ఇబ్బందులు పడుతూ కాలం గడుపుతున్నార న్నారు. ఇప్పటికైనా ప్రత్యేకమైన సర్వే నిర్వహించి అర్హులైన వాళ్లందరికీ రేషన్ కార్డులు సరఫరా చేసి నిత్యావసర సరుకులు అందించాలనీ వారు డిమాండ్ చేశారు. అడ్డా కూలీలకు లేబర్ కార్డులు కూడా అందేటట్టు చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో ఉంటున్న గిరిజనులకు ఉపాధి అవకాశాల్లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ జీవనం గడుపుతున్నారన్నారు. సీఎం హామీ ప్రకారం గిరిజన యువకులకు నిరుద్యోగ భృతి అందేటట్లు చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిరిజన యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా గిరిజన సంక్షేమ శాఖ ట్రైకార్ ద్వారా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి ఆదుకోవాలన్నారు. గిరిజనుల సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే కాలంలో పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు రామావత్ పాండు నాయక్, సీఐటీయూ నాయకులు మహేందర్. జే.భాస్కర్, గోరియా నాయక్, ఆర్.నరేష్, ఎం.రాజు, వినోద్, రజిత, చందు తావుర్య, తదితరులు పాల్గొన్నారు.
గిరిజన సంఘం జిల్లా నూతన కమిటీ ఎన్నిక
గిరిజన సంఘం హైదరాబాద్ సెంట్రల్ జిల్లా నూతన కమిటీని 11 మందితో ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యింది. అధ్యక్షులుగా నేనావత్ రఘు నాయక్, ఉపాధ్యక్షులుగా ఆర్.నరేష్, జె.భాస్కర్ నాయక్. కె.గొరియా నాయక్, జిల్లా కార్యదర్శి శివ శంకర్ నాయక్, బి.వినోద్ కుమార్, రజిత, రాజు, కల్యాణిని ఎన్నుకున్నారు.