Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఆర్ఎస్ఎస్ అనుబంధ టీచర్ యూనియన్‌తో ఓయూ అధికారికంగా నిర్వహిస్తున్న సెమినార్‌ను రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, టీఎస్ ఎంఎస్ఎఫ్, ఎస్ఎస్యూ ఆధ్వర్యంలో మంగళవారం ఓయూ వీసీకి వినతిపత్రం అందజేశారు. శాస్త్రీయ భావాల కు అనుగుణంగా నడవాల్సిన యూనివర్సిటీలు, మతవాద ఆర్ఎస్ఎస్ అనుబంధ ఉపాధ్యాయ సంఘంతో సెమినార్ నిర్వహించాలని భావించడం దారుణమని పేర్కొన్నారు. వెంటనే ఆ సెమినార్‌ను రద్దు చేయాలని కోరుతూ ఓయూ వీసీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా మతోన్మాద భావాలు ఉసిగొల్పుతూ, దళిత, గిరిజన, మైనా రిటీలపై దాడులు చేస్తూ, భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి, ప్రజలను మత ప్రాతిపదికన విభజిస్తున్న ఆర్ఎస్ ఎస్ దాని అనుబంధ ఉపాధ్యాయ సంఘంతో ఓయూలో అధికారికంగా సెమినార్ నిర్వహించాలని భావించడం హేయమైన చర్య అన్నారు. తెలంగాణలో బీజేపీ బలపడడానికి, ప్రభుత్వ సంస్థలే ముందుకు రావడం తెలంగాణ సమాజానికే సిగ్గు చేటన్నారు. ఓయూ వీసీ, తెలంగాణ ప్రభుత్వం సెమినార్‌కు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని, లేదంటే తామే అడ్డుకుంటామని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ ఓయూ కార్యదర్శి క్రాంతిరాజ్, రెహమాన్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు మూర్తి, నాయకులు రవి నాయక్, పీడీఎస్‌యూ ఓయూ అధ్యక్షులు సుమంత్, శ్యాం, టీఎస్ ఎంఎస్ఎఫ్ నాయకులు తిరుమలేష్, పీడీఎస్‌యూ నాయకులు రంజిత్, ఎస్ఎస్యూ నాయకులు దివాకర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.