Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర వ్యాప్తంగా గోదాముల నిర్మాణం
- రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్
- శామీర్‌పేట మండలం అంతాయపల్లిలో స్ట్రాంగ్ రూంలు ప్రారంభం
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సమయంలో అవసరమైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎం), వీవీ ప్యాట్ల భద్రత కోసం అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో ప్రత్యేక గోదాము (స్ట్రాంగ్ రూమ్)లు నిర్మిస్తున్నట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ అన్నారు. శుక్రవారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని శామీర్‌పేట మండలంలోని అంతాయపల్లిలో నూతన కలెక్టరేట్ ప్రాంగణంలో రూ.1.95 కోట్లతో 7,700 స్వ్కేర్ ఫీట్లతో 3,140 ఈవీఎంలు, వీవీ ప్యాట్లను ఉంచేలా నిర్మించిన ఈవీఎంలు, వీవీ ప్యాట్ల గోదాములను శశాంక్ గోయల్ జిల్లా కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్‌తో కలిసి ప్రారంభించి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ఎన్నికల సమయాల్లో ఎన్నికల కోడ్ వెలువడినప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తయ్యే వరకు ఈవీఎమ్‌లు ఎంతో ముఖ్యమైన వన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం ఈవీఎంల భద్రత కోసం ప్రత్యేక దృష్టిసారించి నిధులకు ఎలాంటి కొరత లేకుండా అన్ని హంగులతో ఈవీఎంలు, వీవీ ప్యాట్ల కోసం ప్రత్యేకంగా గోదాములు (స్ట్రాంగ్‌రూమ్‌లు) నిర్మించేందుకు నిర్ణయించినట్టు వివరించారు. ఈ సందర్భంగా భవనంతో పాటు రోడ్డు, కాంపౌండ్ వాలును శశాంక్ గోయల్ పరిశీలించారు. ప్రస్తుతం కొత్తగా నిర్మించిన స్ట్రాంగ్ రూమ్ గోదాములలో జిల్లాలోని ఆయా నియోజకవర్గాల వారీగా ఈవీఎంలను భద్రపర్చడానికి అనువుగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా కంపార్టుమెంట్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల సమయంలో ఈవీఎంలు, వీవీ ప్యాట్లను భద్రపర్చేందుకు ప్రత్యేకంగా స్ట్రాంగ్ రూంలను నిర్మించినందున మున్ముందు వీటిని వేర్వేరు చోట్ల నుంచి తీసుకురావాల్సిన ఇబ్బందులు లేకుండా ఉంటుందన్నారు. ప్రతి ఎన్నికల సమయంలో ఈవీఎంలు, వీవీ ప్యాట్లను జిల్లా కలెక్టరేట్ ఆవరణలోని స్ట్రాంగ్ రూంల నుంచి తీసుకువెళ్ళడం, తిరిగి అక్కడే భద్రపర్చడం వల్ల సమయం వృథా కాకుండా ఉండటంతో పాటు ప్రత్యేక భద్రత కల్పించడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని కలెక్టర్ హరీశ్ తెలిపారు. గతంలో ఎన్నికల సమయానికి ముందు ప్రభుత్వ, ప్రయివేటు విద్యా సంస్థల్లో వీటిని భద్రపర్చడం ఎన్నికల సమయానికి డిస్ట్రిబ్యూషన్, రిసీవింగ్ సెంటరుకు తీసుకురావడానికి ఇబ్బందులు ఉండేవనీ, ప్రస్తుతం నిర్మించిన గోదాముల వల్ల ఒకే దగ్గర నుంచి తీసుకువచ్చి తిరిగి అక్కడే స్ట్రాంగ్ రూంలలో భద్రపర్చడం జరుగుతుందన్నారు. అనంతరం ఈవీఎం గోదాము (స్ట్రాంగ్‌రూమ్) ఆవరణలో అధికారు లతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, ఆర్అండ్బీ అధికారి శ్రీనివాస్ మూర్తి, ఆర్డీవో రవి, మండల తహశీల్దార్, తదితరులు పాల్గొన్నారు.