Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓసీ సమస్యలు పరిష్కరించాలని
మంత్రి టి.హరీశ్‌రావుకు వినతి
నవతెలంగాణ-హైదరాబాద్
ఆర్థికంగా వెనకబడిన ఓసీలకు విద్యా, ఉద్యోగాల్లో కల్పించిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అర్హత సర్టిఫికెట్ల జారీలో అధికారులు జాప్యం చేస్తున్నారని, సంబంధిత అధికారులకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షులు, రైతు ఉద్యమ నేత పోలాడి రామారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఓసీ సమాఖ్య నాయకులతో కలిసి క్యాంప్ కార్యాలయంలో మంత్రి టి.హరీశ్ రావుకు ఓసీల సమస్యలు, డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా రామారావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రెడ్డి, వైశ్యుల సంక్షేమానికి కార్పొరేషన్ల ఏర్పాటుకు ఈ మార్చి బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టి, చట్టబద్ధత కల్పించి ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. విదేశీ విద్య నిమిత్తం రూ.20 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేయాలని కోరారు. ప్రతి నియోజకవర్గంలో గురుకుల పాఠశాలలు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న 35 జనరల్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల సంఖ్యను 100కు పెంచాలని, రైతులకు రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య భీమా కల్పించాలని, 50 ఏండ్లు నిండిన రైతులందరికి నెలకు రూ.5,000 చొప్పున పెన్షన్ అందజేయాలని కోరారు. ఓసీలలోని యువతకు స్వయం ఉపాధి నిమిత్తం రూ.10 లక్షల వడ్డీ లేని ఋణం ఇవ్వాలని, సన్న, చిన్నకారు వ్యవసాయ రంగాన్ని ఉపాధి హామి పథకంలో అనుసంధానించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని జలాశయాలన్ని పూర్తిస్థాయి నీటి మట్టం ఉండడంతో వాటి క్రింద ఆయకట్టు ఆరుతడి పంటకు యోగ్యంగా లేకుండా పోయిందని, తద్వారా వరి మినహా మరో పంట వేసే మార్గం రైతుకు లేకుండా పోయిందన్నారు. ఆరుతడి పంటల సాగుకు విత్తనాల కొరత, మద్దతు ధర, మార్కెటింగ్ సౌకర్యం లాంటి ప్రత్యామ్నాయ మార్గాలను రాష్ట్ర ప్రభుత్వం సూచించనందున యాసంగిలో వరి వేయవద్దనే ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఓసీ సమాఖ్య నాయకులు పొనుగంటి శ్రావణ్, నలమాస ప్రభాకర్, చాడ రవీందర్ రెడ్డి, జనగామ కరుణాకర్ రావు, బండా కిషన్ రెడ్డి, చింతిరెడ్డి సత్యనారాయణరెడ్డి, బైరెడ్డి రాంరెడ్డి, ఉమ్మెంతల శ్యాంసుందర్ రెడ్డి, వంగల తిరుపతిరెడ్డి, నల్ల రాజిరెడ్డి, చిటుకుల నర్సింహారెడ్డి, సరిగాని ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.