Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచి ఈనెల 28వరకు హైదరాబాద్ బుక్ ఫెయిర్
- ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి
- 260 స్టాల్స్‌లో 2.50 లక్షల పుస్తకాలు
- కొలువుదీరనున్న వేలాది గ్రంథాలు, కొత్త పుస్తకాలు
- కవులు, రచయితలను ప్రొత్సహించేందుకు ప్రత్యేక స్టాల్
నవతెలంగాణ-సిటీబ్యూరో
విద్య, విజ్ఞానం, అవగాహన, సామాజిక స్పృహ... ఇలా ఏ విషయాలైనా సరే పుస్తకాల ద్వారా తెలుసుకోవచ్చు. ఒక్కో పుస్తకం ఒక్కో విధమైన ప్రాధాన్యత కలిగి ఉంటుంది. అందుకే చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో అంటారు. ఒక్కటేమిటి వందలాది, వేలాది పుస్తకాలు ఒకేదగ్గర కొలువుదీరే పుస్తకాల పండుగ సిటీలో నేటి నుంచి ప్రారంభం కానుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. కరోనా నేపథ్యంలో రెండేండ్ల తర్వాత పుస్తక ప్రియులను ప్రేమపూర్వకంగా ఆలింగనం చేసుకునేందుకు పుస్తక సమ్మేళనం రానే వచ్చేసింది. లక్షలాది సాహితి ప్రియులను, విద్యార్థులను, పిల్లల ఒడిలోకి సేదతీరేందుకు పుస్తక ప్రాంగణం సిద్ధమవుతోంది. కరోనా మహమ్మారితో ఒంటరైన మెదళ్లను స్వేచ్ఛా ప్రపంచంలోకి తిరిగి ప్రయాణించేందుకు మనందరినీ ఆప్యాయంగా ఆహ్వానిస్తోంది. నేటి నుంచి ఈనెల 28వ తేదీ వరకు జరిగే 34వ జాతీయ పుస్తక ప్రదర్శన ఇందిరాపార్క్ ఎదురుగా ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభం కానుంది. 11 రోజుల కొనసాగనుంది.
హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఏటా 320 స్టాళ్లతో పుస్తక ప్రదర్శన నిర్వహిస్తోంది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈసారి 250 స్టాల్స్ మాత్రమే ప్రదర్శనలో పెడుతున్నారు. ఈ బుక్ ఫెయిర్‌కు ఢిల్లీ, ముంబయి, మద్రాస్, విజయవాడ తదితర రాజధానుల నుంచి వివిధ పబ్లిషర్స్ ప్రచురించిన అన్ని భాషలలోని పుస్తకాలను ప్రదర్శనకు ఉంచునున్నారు. తెలుగు హిందీ, ఉర్దూ, సంస్కృతం, ఇంగ్లీష్ తదితర భాషలలో పుస్తకాలు అందుబాటులో ఉంటాయి.
రచయితల బుక్స్ స్టాల్
ఈ బుక్ ఫెయిర్‌లో కొత్తగా వచ్చే రచయితలకు ప్రత్యేకంగా పుస్తకాల స్టాల్‌ను ఏర్పాటు చేశారు. రచయితలకు ఆర్థిక స్థోమత బాగా లేకపోయినా వారి పుస్తకాలను ప్రమోట్ చేయడం, విక్రయించి వారిని ప్రోత్సహించడం చేయనున్నారు. అంతేగాక రచయితలకు ప్రత్యేక హాల్ ఏర్పాటు చేశారు. ఇందులో రచయితలు తమ పుస్తకాలను స్వయంగా ప్రదర్శించేందుకు ఏర్పాటు చేశారు.
ప్రదర్శన వేళలు ఇలా..
సిటీలో 11రోజుల పాటు జరిగే హైదరాబాద్ బుక్ ఫెయిర్ సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజూ మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు కొనసాగనుంది. శని, అదివారాలు, సెలవు రోజుల్లో మధ్యాహ్నం 12.30 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు కొనసాగనుంది. విద్యార్థులకు ప్రవేశం ఉచితం. కాబట్టి జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యాలు తమ విద్యార్థులను ఈ బుక్ ఫెయిర్‌ను సందర్శించే విధంగా చొరవ తీసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.
జ్ఞాన తెలంగాణే లక్ష్యం
జ్ఞాన తెలంగాణే లక్ష్యంగా హైదరా బాద్ బుక్ ఫెయిర్- 2021లో భాగస్వాముల వుతున్నందుకు సంతోషంగా ఉంది. 34వ జాతీయ పుస్తక ప్రదర్శనకు అంతా సిద్దం చేశాం. ఈ పుస్తక మహోత్స వాన్ని ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, పురావస్తు, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. 260కు పైగా స్టాల్స్‌లో తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో 2.50 లక్షల గ్రంథాలు, పుస్తకాలు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే పుస్తకాలు కొలువుదీర నున్నాయి. అందుకోసం విద్యార్థులు, ఉపాధ్యాయులు, మేధావులు, కవులు, రచయితలు, కళాకారులందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుతున్నాం. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు మరింత ముందుకు తీసుకువేళ్లేడమే లక్ష్యంగా ఈసారి బుక్ ఫెయిర్ వేదికకు ప్రముఖ యక్షగాన కళాకారిణి చిందు ఎల్లమ్మ పేరును, ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ నేరేళ్ల వేణు మాధవ్ ప్రాంగణంగా ప్రకటించాం. కొత్త రచయితలు, కవులను ప్రోత్సహించే విధంగా ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేశాం. ఈ పుస్తక పండుగను విద్యార్థులు, ఉపాధ్యాయులు, కవులు, రచయితలు, పోటీ పరీక్షలకు సిద్దమయ్యే విద్యార్థులు, పుస్తక ప్రియులు పాల్గొని జయపద్రం చేయాల్సిందిగా చంద్రమోహన్ కోరారు.
కోయ చంద్రమోహన్, కార్యదర్శి , హైదరాబాద్ బుక్ ఫెయిర్