Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
బాక్సింగ్‌లో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందిన జి నరేష్ గౌడ్ ఎన్ ఫిట్ పేరుతో బాక్సింగ్ క్లబ్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని హిమాయత్ నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్‌గౌడ్, ప్రముఖ సంఘసేవకుడు, సామాజికవేత్త అంబర్ పేట్ శంకర్ అన్నారు. శుక్రవారం హిమయత్ నగర్ డివిజన్ హైదర్ గూడలో నూతనంగా ఏర్పాటు చేసిన బాక్సింగ్ క్లబ్‌ను పలు పార్టీల నేతలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 సార్లు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి గోల్డ్ మెడల్స్ సాధించిన నరేష్ గౌడ్ మరింత మంది బాక్సింగ్ క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయిలో నిలిచేలా సిద్ధం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. బాక్సింగ్‌లో ప్రావీణ్యం ఉండి శిక్షణ తీసుకునేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి ఉచితంగా శిక్షణ అందించేందుకు ఆయన ముందుకు రావడం స్వాగతించదగ్గ విషయమన్నారు. చిన్నతనం నుంచి ఎంతో కష్టపడి ఎల్బీ స్టేడియంలో శిక్షణ తీసుకున్న నరేష్ లాంటి వాళ్ళు బాక్సింగ్ క్లబ్‌లు ఏర్పాటు చేయడం వల్ల ప్రపంచ స్థాయి క్రీడాకారులను తయారు చేసేందుకు ఎంతో దోహద పడుతుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఎల్బీ స్టేడియం బాక్సింగ్ చీఫ్ కోచ్ ఓంకార్ నాథ్ యాదవ్, హైకోర్టు న్యాయవాది పి సునీల్ కుమార్, లాలాపేట్ లల్లు ముదిరాజ్, దర్గా చిన్న గౌడ్ పైల్వాన్, రాంనగర్ అఖిల్, అర్చన ముదిరాజ్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.