Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 43వ ఆలిండియా అకౌంటింగ్ కాన్ఫరెన్స్ ఆదివారం ముగిసింది. ఉస్మానియా యూనివర్సిటీ కామర్స్ విభాగం ఆధ్వర్యంలో ఆలిండియా అకౌంటింగ్ కాన్ఫరెన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెమినార్ ఆన్ అకౌంటింగ్ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్'ను ఘనంగా నిర్వహించారు. ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ సదస్సు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిగ్నోడ్ ఇండియా లిమిటెడ్ ఎండీ గౌరవ్ మహేశ్వరి హాజరై మాట్లాడారు. ప్రస్తుత అధునాతన సాంకేతిక యుగంలో ఒక రోజు ముందు ఆలోచించడం సరిపోదన్నారు. ప్రత్యేకించి అకౌంటింగ్ వంటి రంగాల్లో కనీసం 20 ఏండ్లు ముందు ఆలోచించాలని సూచించారు. ప్రాథమిక అకౌంటింగ్ కార్యకలాపాలన్నింటినీ నూతన సాంకేతికత చేయగలుగుతున్నామన్నారు. అకౌంటెంట్లు పరిశోధన, నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలనీ, అప్పుడే ఆ రంగంలో నిలదొక్కుకోవచ్చని అభిప్రాయపడ్డారు. సదస్సు కార్యదర్శి ప్రొఫెసర్ వి.అప్పారావు మాట్లాడుతూ ఓయూ కామర్స్ విభాగం ప్లాటినం జూబ్లీ వేడుకలు, ఇండియన్ అకౌంటింగ్ అసోసియేషన్ డైమండ్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఈ సదస్సు నిర్వహించడం గర్వకారణమన్నారు. విద్యార్థులను ప్రస్తుత కాలంలో అందుబాటులోకి వస్తున్న నూతన సాంకేతికత, ఆధునిక పద్ధతులను తెలుసుకునేందుకు ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. సదస్సులో వంద మందికిపైగా పరిశోధకులు తమ పరిశోధనా పత్రాలు సమర్పించినట్టు తెలిపారు. సదస్సు మొత్తం డిజిటల్ అకౌంటింగ్, ట్యాక్స్ అకౌంటింగ్, కార్పొరేట్ డిజర్ అండ్ కాంప్లియెన్స్, అకౌంటింగ్ ఎడ్యుకేషన్, అకౌంటింగ్ రీసర్చ్ తదితర అంశాలపై సెషన్లు జరిగాయని పేర్కొన్నారు. వీటిలో ప్రతి అంశంలో ఉత్తమ పరిశోధక పత్రానికి అవార్డును అందించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మెన్ ప్రొఫెసర్ వెంకటరమణ, ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ఓఎన్డీ ప్రొఫెసర్ రెడ్యానాయక్ హాజరయ్యారు. అనంతరం ఇండియన్ అకౌంటింగ్ అసోసియేషన్ (ఐఏఏ) జాతీయ అధ్యక్షుడిగా ప్రొఫెసర్ ఎంఎల్ వధేరా, సీనియర్ ఉపాధ్యక్షుడిగా ప్రొఫెసర్ జస్రాజ్ బోహ్రా, జూనియర్ ఉపాధ్యక్షుడిగా ప్రొఫెసర్ అప్పారావు బాధ్యతలు స్వీకరించారు. ప్రతిష్టాత్మక ఐఏఏ ఉపాధ్యక్షుడిగా ఓయూ ప్రొఫెసర్ అప్పారావు బాధ్యతలు స్వీకరించడంతో కామర్స్ విభాగం అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా అప్పారావును సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఐఏఏ మాజీ అధ్యక్షుడు ప్రొఫెసర్ జి. సోరల్, కోశాధికారి ప్రొఫెసర్ అరిందమ్ గుప్త, సంయుక్త కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ శర్మ, సంయుక్త కోశాధికారి డాక్టర్ అశోక్ అగర్వాల్, కామర్స్ విభాగం హెడ్ ప్రొఫెసర్ వి.ఉషాకిరణ్, కామర్స్ ఫ్యాకల్టీ డీన్ ప్రొఫెసర్ ప్రశాంత ఆత్మ, కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చెన్నప్ప, ప్రొఫెసర్ నాగేశ్వరరావు, నరేష్ రెడ్డి, డాక్టర్ ప్యాట్రిక్, డాక్టర్ సంధ్యారాణి, తదితరులు పాల్గొన్నారు.