Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
నేటి పరిస్థితుల్లో ఎక్కడ చూసిన మానవ హక్కులకు భరోసా ఇచ్చే పరిస్థితులు లేవని, యథేచ్ఛగా మానవ హక్కుల హననం జరుగుతోందని పలువురు పౌరహక్కుల నేతలు, సామాజిక కార్యకర్తలు ఆందోళన చెందారు. మానవహక్కుల హననం నిత్యకృత్యంగా సాగుతోందని, పిల్లలు, మహిళల హక్కులకు దిక్కులేకుండా పోతోందని వాపోయారు. ఆదివారం జమాతె ఇస్లామీహింద్ నగర శాఖ ఆధ్యర్వంలో 'మానవ హక్కుల సంక్షోభం-పరిష్కారాలు' అంశంపై సెమినార్ నిర్వహించారు. మెహదీ పట్నం జెవెల్ గార్డెన్ బాంకెట్ హాల్లో జరిగిన ఈ సదస్సుకు జమాతె ఇస్లామీహింద్ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా హమీద్ ముహమ్మద్ ఖాన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనుషులందరికీ స్వతహాగా పుట్టుకతో హక్కులు సంక్రమిస్తాయని, ఆ హక్కుల సాధనకోసం పోరాటం చేయడమన్నది మానవసమాజంలోనే జరుగుతుందన్నారు. ఆదివాసీ, సంచార జాతుల హక్కులు తరచూ ఉల్లంఘనకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని నింపితే కొంతవరకు హక్కుల హననానికి అడ్డుకట్ట వేయవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. హఫీజ్ రషాదుద్దీన్ మాట్లాడుతూ ఈజిప్టులో ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని కూల్చేసి అమెరికా తన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని గద్దె నెక్కించిందని, ప్రజాపాలకులను జైళ్లలో బంధించిందని చెప్పారు.
మనుస్మృతిని అమలు పర్చాలని కుట్ర : డాక్టర్ హరగోపాల్
రాజ్యాంగాన్ని మార్చి దేశంలో మనుస్మృతిని అమలు చేసేందుకు హిందుత్వవాదులు కుట్రలు పన్నుతున్నాయని డాక్టర్ హరగోపాల్ అన్నారు. ఎవరైనా తనకు నచ్చిన మతాన్ని స్వీకరించి, ఆచరించి ప్రచారం చేసుకునే స్వేచ్ఛ మనకు రాజ్యాంగం కల్పించిందన్న వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. డాక్టర్ ఎస్.ఆర్.లిస్సీ జోసెఫ్ మాట్లాడుతూ సమాజం నుంచి విద్వేష సంస్కృతిని రూపుమాపాలన్నారు. ప్రజలను తమతమ హక్కుల సాధనకోసం అప్రమత్తం చేయాలని, హక్కులను దోచుకునే దురవస్థను నిరసించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో హైకోర్టు అడ్వకేట్ షకీల్ సాబ్ తదితరులు పాల్గొన్నారు.