Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కు అపూర్వ స్పందన లభిస్తోంది. శనివారం ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభమైన 34వ జాతీయ హైదరాబాద్ పుస్తక ప్రదర్శన 2వ రోజు వేలాది మందితో కళకళలాడింది. అందులో అదివారం సెలవు దినం కావడంతో పండుగ వాతావరణం కనిపించింది. నగర ప్రజలు, రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఏపీ నుంచి కూడా ఎంతో ఉత్సాహంగా ఇందులో పాల్గొని తమకు కావాల్సిన పుస్తకాలను కొనుగోలు చేశారు. ముఖ్యంగా సాంకేతిక రంగం ఎంతో వేగంగా విస్తరిస్తున్న ఈ సమయంలోనూ.. పుస్తకప్రియులకు కొదవ లేదని, ఇంటర్నెట్, ఫేస్బుక్, వాట్సాప్ వంటి ఇతర సామాజిక మాధ్యమాల్లో కావాల్సిన సమాచారం క్షణాల్లో దొరుకుతున్న ప్రస్తుత తరుణంలో పుస్తకాల కోసం ప్రజలు భారీగా తరలిరావడం చూస్తే వారి పఠనాసక్తికి సలాం చెప్పవచ్చు.
ఇదిలావుంటే ఈ బుక్ఫెయిర్లో ప్రధానంగా విద్యార్థులు, యువకులు, వృద్ధులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక్కడ ఏర్పాటు చేసిన దాదాపు 260 గ్రంథ విక్రయ కేంద్రాలను కలియతిరుగుతూ పెద్దలు, పిల్లలు, యువకులు, విద్యార్థులు ఆద్యంతం సేదతీరారు. కరోనా నేపథ్యంలో ఏదో తెలియని ఒత్తిడికి గురవుతున్న వారు ఇక్కడి రావడంతో మరో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినంత ఆనందంలో మునిగిపోయారు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు కావాల్సిన పుస్తకాలను కొనిచ్చారు. అలాగే విద్యార్థులు, యువత, మహిళలు, వృద్ధులు తమకు కావాల్సిన పుస్తకాలను కొనడంలో ఉత్సాహం చూపించారు. ఈ బుక్ఫెయిర్లో ఏర్పాటు చేసిన విక్రయ కేంద్రాల్లో కొన్ని ప్రత్యేకంగా నిలవడంతో పాటు అక్కడి స్టాల్స్‌లో పెట్టిన పుస్తకాలకు మంచి ఆదరణ లభిస్తోందని నిర్వాహకులు చెప్పారు. ఇందులో నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ స్టాల్లో ఉంచిన పలు పుస్తకాల్లో భారతదేశం రైతు ఉద్యమం, స్వాతంత్య్ర సమరం, రష్యా విప్లవం-రైతాంగం, రిజర్వేషన్ బోగి, సంపన్నులు పైపైకి..సామాన్యులు అదోగతికి, మూఢ విశ్వాసాలు, మగ్దం మోహినుద్దీన్, మహనీయుల బడి చదువులు, అంటరాని దేవుడు, ఆధునిక ప్రపంచ చరిత్ర, షోల్కో కథలు, గోర్కి కథలు, చిల్లర దేవుళ్లు, చేగువీరా, భూమి చట్టాలపై మీ ప్రశ్నలు-మా సమాధానాలు వంటి పుస్తకాలకు మంచి స్పందన ఉందని నిర్వహకులు తెలిపారు. అలాగే స్టాల్ 238లో జ్యోతిరావ్ పూలే, సైన్స్ వెలుగులు, దళిత గీతాలు, జ్ఞానం-విజ్ఞానం, బిపిన్ చంద్ర రాసిన అన్ని పుస్తకాలు, నీల్ అర్మాస్ట్రాంగ్, ప్రపంచాన్ని కదిలించిన పదిరోజులు, బీహార్ టు తీహార్ దాకా కన్నయ్య కుమార్, వైతాళికుడు అంబేద్కర్, తెలంగాణ-భాషా, క్రియా పదాలు వంటి పుస్తకాలకు పుస్తక ప్రియుల నుంచి మంచి గిరాకీ ఉందని నిర్వాహకులు తెలిపారు. దీంతోపాటు వామపక్ష భావజాలం సమగ్ర సాహితి పుస్తకాలు లభించే 'లెఫ్ట్వర్'్డ స్టాల్లో రికైమ్లింగ్ ఐడియా ఆఫ్ ఇండియా, సీతారాం ఏచూరి రాసిన పార్లమెంటరీ ప్రసంగాలు, నెల్సన్ మండేలా రచించిన లాంగ్ వాక్, అబ్దుల్ కలాం వింగ్స్ ఆఫ్ ఫైర్, ఆంటోనీ గ్రాంసీ సాహిత్యం, జస్టిస్ చంద్రు రాసిన లిసన్ టు మై కేస్ వంటి పుస్తకాలకు మంచి ఆదరణ లభిస్తుందని వివరించారు. బాల సాహిత్య పుస్తకాలు సమగ్రంగా లభించే స్టాల్ నెంబర్ 17లో.. చందమామ కథలు, రాబిన్ శర్మ బుక్స్, బైబిల్ స్టోరీస్, యోగా, అరేబియన్ నైట్స్, 21వ శతాబ్ధికి-21 పాఠాలు, సైన్స్ బుక్స్, డిక్షనరీలు, జంతువుల కథలు వంటి వాటికి గిరాకీ బాగుందని నిర్వహకులు వివరించారు. ఇదే సమయంలో పుస్తక ప్రదర్శన జరగుతున్న తీరు పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేసిన నిర్వహకులను అభినందించారు. ముఖ్యంగా కొవిడ్ నిబంధనలు పాటిస్తుండడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
కొత్త పుస్తకాల ఆవిష్కరణ
అదివారం బుక్ ఫెయిర్‌లో రెండు పుస్తకాల ఆవిష్కరణ జరిగింది. ఇందులో చిందు ఎల్లమ్మ మనువరాలు కొమ్ము రజిత రాసిన దళిత్ డైరీస్ ఉండగా.. దీనికి ముఖ్య అతిథిగా ఆచార్య కొలకలూరి ఇనాక్ పాల్గొని ఆవిష్కరించారు. కవిని అలూరి రాసిన అమ్మ జ్ఞాపకాలు పుస్తకాన్ని ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలు సహకార సమాఖ్య స్ఫూర్తితోనే రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో వనం జ్వాలా నరసింహరావు పుస్తకాలను తెలంగాణ మీడియా అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలురి గౌరీ శంకర్ ఆవిష్కరించారు.