Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్.రామకృష్ణా రెడ్డి
నవతెలంగాణ-ఎల్బీనగర్
ఎల్బీనగర్ జోనల్ పరిధిలో అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్స్కు వెంటనే బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్.రామ కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఇక్కడి జోనల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జోనల్ కమిషనర్ పంకజంకు వినతిపత్రం అందజేసి సమస్యలను వివరించారు. తమకు 10 నెలల నుంచి బిల్లులు రావడం లేదని తెలిపారు. స్పందించిన జోనల్ కమిషనర్ పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి బిల్లులు చెల్లించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... మార్చి 21 నుంచి 26 వరకు కాంట్రాక్టర్స్కు రావాల్సిన బిల్లులు మొత్తం చెల్లించాలని డిమాండ్ చేశారు. అప్పులు చేసి తాము అభివృద్ధి పనులు చేస్తే 10 నెలలుగా చెల్లించకపోవడంతో ఇబ్బందిపడుతున్నామని, ఇటువంటి పరిస్థితి వల్ల కొందరు కాంట్రాక్టర్లు పనులకోసం చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు వెంటనే చెల్లించాలని, చెల్లించకుంటే జనవరి 3 నుంచి పనులను నిలిపివేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శివకుమార్, కోశాధికారి నర్సింహా, అసోసియేషన్ నాయకులు సుంకరి సత్తయ్య, శ్రీశైలం, సుదర్శన్, శివారెడ్డి, కుమార్, శివారెడ్డి పాల్గొన్నారు.