Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరెడ్మెట్ / సరూర్‌నగర్‌లో
ఇంటర్లో ఫెయిల్ చేసిన విద్యార్థులను వెంటనే పాస్ చేయాలని ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ తదితర ఐక్య విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఇంటర్ ఫస్టియర్‌లో 53 శాతం ఫెయిల్ కావడం అంటే అది బోర్డు వైఫల్యమని, విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వం, ఇంటర్మీడియెట్ బోర్డు నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డాయి.
అల్వాల్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు తరగతులు బహిష్కరించి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇంటర్ బోర్డు, ప్రభుత్వ వైఖరిపట్ల నిరసన వ్యక్తం చేశారు. ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉపాధ్యక్షుడు బ్యాగారి వెంకటేష్ మాట్లాడుతూ.. పేపర్లు ఇంత నిర్లక్ష్యంగా ఎలా దిద్దారు? కండ్లు మూసుకుని దిద్దారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్‌బోర్డు తప్పిదానికి ఫెయిల్ అయ్యామన్న బాధతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.20లక్షల చొప్పున ఆర్థికసాయం వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. ఇంటర్లో అత్యధికమంది విద్యార్థులు ఫెయిల్ అవడం ప్రభుత్వం, ఇంటర్ బోర్డు వైఫల్యానికి నిదర్శనమని, పాఠాలు చెప్పకుండా పరీక్షలు పెట్టి, ఫెయిల్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. విద్యార్థులను ప్రమోట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎగ్జామ్స్ పేపర్లు దిద్దడానికి సమయం కేటాయించకుండా ఇష్టానుసారంగా మార్కులు వేయడంతో కొందరు విద్యార్థులు ప్రాణాలు తీసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యమేనని, ఫెయిల్‌కు, ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఫెయిల్ కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున ఆర్థికసాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మల్కాజిగిరి నియోజకవర్గ నాయకులు విశాల్, అల్వాల్ మండల నాయకులు శ్రీకాంత్ తదితర నాయకులు పాల్గొన్నారు
ఉప్పల్‌లో... ఫెయిల్ అయిన విద్యార్థులను పాస్ చేయాలని ఎస్ఎఫ్ఐ ఉప్పల్ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు కాసిం జాలం, అఖిల డిమాండ్ చేశారు. హబ్సిగూడలోని కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. కరోనా కాలంలో సిలబస్ పూర్తిస్థాయిలో చెప్పకుండా పరీక్షలు పెట్టి ఫెయిల్ చేయడం సరైంది కాదన్నారు. ప్రతి ఒక్క విద్యార్థిని మాస్ ప్రమోషన్ ద్వారా పాస్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ నియోజకవర్గ ఉపాధ్యక్షులు సాయి తేజ్, కమిటీ సభ్యులు సాగర్ తదితరులు పాల్గొన్నారు.
ఫెయిల్ అయిన విద్యార్థులకు గ్రేస్ మార్కులు వేసి అందర్నీ పాస్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ, ఏఐఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్ కాలేజీల విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రియాజ్, రాష్ట్ర సహాయ కార్యదర్శి మహేష్, నాయకులు సైదులు, విలేస్, రాకేష్, మానస, మౌనిక తదితరులు పాల్గొన్నారు.