Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి.చెన్నయ్య
నవతెలంగాణ-హైదరాబాద్
మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు పీవీ రావు దళితుల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేశారని, ఆయన దళిత జాతికి చేసిన సేవలు మరువలేనివని మాలమహానాడు జాతీయ అధ్యక్షులు జి.చెన్నయ్య కొనియాడారు. మాలమహానాడు ఆధ్వర్యంలో మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు పీవీ రావు 16వ వర్ధంతి, బడుగు, బలహీన వర్గాల తెలంగాణ పోరాట యోధుడు (కాకా) 7వ వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం లిబర్టీలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం వద్ద వారి చిత్రపటాలకు పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్బంగా జి.చెన్నయ్య మాట్లాడుతూ మాలమహానాడు వ్యవస్థాపకులు, ఐఏఎస్ క్యాడర్ కలిగిన పి.వి రావు తన అత్యున్నత ఉద్యోగం వదిలేసి దళితుల హక్కుల కోసం పోరాడుతూ ఢిల్లీలో తన చివరి రక్తపు బొట్టు వరకు పోరాడి అసువులు బాశారని గుర్తు చేశారు. పి.వి రావు ఆశయసాధనకు బడుగు, బలహీన వర్గాల ప్రజలు తమ హక్కుల కోసం పోరాటాలు చేయవలసిన అవసరం ఉందన్నారు.రాష్ట్రంలోని దళితులు, మేధావులు, ఉద్యోగులు అందరూ కలిసి అంబేద్కర్ విగ్రహాల వద్ద పి.వి రావు వర్ధంతి సభలను నిర్వహించాలని సూచించారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు గడ్డం వెంకటస్వామి(కా.కా) ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తన చివరి శ్వాస వరకు పోరాడారని గుర్తు చేశారు. కార్యక్రమంలో మాలమహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బంగి ఆనందరావు, ఏపీ రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్పరాజ్, తెలంగాణ మాలల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు బేరా బాలకిషన్, యూత్ అధ్యక్షులు జి.రమేష్, గణేష్, పంజాగుట్ట విగ్రహ కమిటీ అధ్యక్షులు పుణ్య భానుప్రకాష్, వర్కింగ్ ప్రెసిడెంట్ వినరు కుమార్, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి జయమ్మ, నాయకులు శేఖర్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.