Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆహార ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే
ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షులు పోలాడి రామారావు
నవతెలంగాణ-హైదరాబాద్
ధాన్యం సేకరణ, కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకదానిపై ఒకటి నెపంనెట్టి రైతులను నట్టేట ముంచుతున్నాయని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షులు, రైతు ఉద్యమ నేత పోలాడి రామారావు ఆరోపించారు. జాతీయ రైతు దినోత్సవం సందర్బంగా గురువారం బషీర్బాగ్లోని ఓసీ సమాఖ్య రాష్ట్ర కార్యాలయంలో రైతు, ప్రజా సంఘాల ప్రతినిధులతో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. దేశంలో రైతులు పండించిన అన్ని రకాల ఆహార ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన బాధ్యత రాజ్యాంగంలో పొందుపరిచిన నిబంధనల మేరకు కేంద్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఈ బాధ్యత నుంచి కేంద్ర ప్రభుత్వం వైదొలగడం సమంజసం కాదన్నారు. .దేశంలో తిండిలేక ఆకలితో రోజుకు ఏడు వేల మంది, ఏడాదికి 25 లక్షల మంది ఆకలితో చనిపోతున్నారని స్వయంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి తెలుపడం ఆందోళన కలింగించే పరిణామమన్నారు. దేశంలో ఇంత మంది ఆకలి చావులకు బలైపోతుంటే, దేశవ్యాప్తంగా గోదాముల్లో నిండి ఉన్న ఆహార ధాన్యాలు, తెలంగాణలో అధికంగా వచ్చిన పంటల ఉత్పత్తులు ఎవరి కోసమన్న సందేహం కల్గకమానదన్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అన్నమో రామచంద్రా అంటూ తిండిలేక చనిపోతున్న ప్రజలనే కాదు, అన్నదాతల ప్రాణాలను బలితీసుకుంటున్న తీరు అత్యంత విషాదకరమన్నారు. దేశంలోని రాజకీయ పార్టీలన్నీ ప్రజలను, వారి సమస్యలను పక్కనపెట్టి కేవలం ఓట్ల రాజకీయమే చేస్తున్నాయని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏమి ఉంటుందని ప్రశ్నించారు. 24 గంటల ఉచిత విద్యుత్ పొందుతున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న విద్యుత్ సంస్కరణల బిల్లు గుదిబండగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే విద్యుత్ సంస్కరణల బిల్లును వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు పండించిన అన్ని రకాల పంటలకు కనీస మద్దతు ధర లభించేలా చట్టాన్ని తీసుకురావాలన్నారు. సమావేశంలో రాష్ట్ర రైతు సంఘాల నాయకులు వడ్లూరి వాసు, మిల్కూరి వాసుదేవరెడ్డి, పొనగంటి శ్రావణ్ కుమార్, రామకష్ణప్రసాద్, బండ కిషన్ రెడ్డి, దుబ్బా శ్రీనివాస్, చిటుకుల నరసింహారెడ్డి, ఓసీ సమాఖ్య నాయకులు మందల రాజేందర్ రెడ్డి, ఉమ్మెంతల శ్యాంసుందర్ రెడ్డి, నలుమాసు ప్రభాకర్, నరసింహారెడ్డి, తిరుపతిరెడ్డి, మాతంగి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.