Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
సిగల్ ఫ్రీ రహదారులుగా మరో రెండు ఫ్లై ఓవర్లు అందుబాటులోకి రానున్నాయని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఆర్డీపీ)ద్వారా చేపట్టిన రెండు ప్రాజెక్టుల్లో భాగంగా షేక్‌పేట్, ఓవైసీ ఫ్లైఓవర్ పనులను మేయర్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పెరుగుతున్న నగరాభివృద్ధికి అనుగుణంగా వాహనాల రద్దీ కూడా విపరీతంగా పెరిగిన నేపథ్యంలో మెరుగైన రవాణా సౌకర్యం కోసం సిగల్ ఫ్రీ రహదారులను చేపట్టడం జరుగుతుందన్నారు. ఎస్అర్డీపీ కార్యక్రమం ద్వారా మహానగర అభివృద్ధికి రూ.8వేల కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, అర్ఓబీలు, రైల్వే అండర్ బ్రిడ్జిలు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటి వరకు రూ.2వేల కోట్ల వ్యయంతో 22 పనులను పూర్తి చేసినట్టు మరో రూ.6 వేల కోట్లతో 25 పనులను వచ్చే సంవత్సరంలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. మహా నగర అభివృద్ధిలో లింక్ రోడ్లు, మిస్సింగ్ రోడ్లు, జంక్షన్ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. కార్పొరేటర్ల ద్వారా, శాసన సభ్యుల ద్వారా సిఫార్స్ చేయమని చెప్పినట్టు మేయర్ అన్నారు. షేక్‌పేట్ ఫ్లైఓవర్ రూ.333.55కోట్ల అంచనా వ్యయంతో 2.71 కిలో మీటర్ల మేరకు చేపట్టినట్టు ఖైరతాబాద్‌జోన్ సర్కిల్ 18 నుంచి శేరిలింగంపల్లి జోన్ మల్కంచెరువు వరకు 6 లైన్లతో ఫ్లైఓవర్‌ను నిర్మించారని తెలిపారు. గతంలో 4 జంక్షన్లు ఉండగా దాంతో 4 లక్షల వాహనదారులు ఇబ్బంది పడే వారని, బ్రిడ్జి అందుబాటులోకి వస్తే సిగల్ ఫ్రీగా ఉంటుందన్నారు. లక్డికాపూల్ నుంచి మెహిదీపట్నం టోలిచౌకి మీదుగా గచ్చిబౌలి వరకు 11 కిలోమీటర్ల మేజర్ ట్రాఫిక్ కారిడార్‌లో మెరుగైన రవాణా సౌకర్యంతో పాటుగా రేతిబౌలి నుంచి ఓర్అర్ఆర్ గచ్చిబౌలి వరకు ఫ్లైఓవర్ కలుపుతుందని, ఈ ఫ్లైఓవర్ బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి జేఎన్టీయూ జంక్షన్ వరకు కలుపుతూ 17 కిలోమీటర్ల మేర ఎలాంటి ట్రాఫిక్ సమస్య లేకుండా చేస్తుందన్నారు.ఓవైసీ ఫ్లైఓవర్ వలన దక్షిణ ప్రాంతం నుంచి తూర్పు ప్రాంతానికి వెళ్లేందుకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వెళ్లవచ్చునని, రూ.63 కోట్ల అంచనా వ్యయంతో 1.36 కిలోమీటర్ల మేరకు చేపట్టామని తెలిపారు. ఆరాంఘర్ నుంచి ఎల్బీనగర్ వరకు ట్రాఫిక్‌ను మెరుగుపరుస్తుందని, మిధాని, ఓవైసీ జంక్షన్లో ట్రాఫిక్ క్రమబద్దీకరణ అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్అర్డీపీ ప్రాజెక్ట్ చీఫ్ ఇంజినీర్ దేవానంద్, జోనల్ కమిషనర్లు ప్రియాంక అలా, రవికిరణ్, అశోక్‌సామ్రాట్, ఎస్అర్డీపీ సూపరింటెండెంట్ వెంకట రమణ, దత్తుపంతు తదితరులు పాల్గొన్నారు.