Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
అమెరికా సంయుక్త రాష్ట్రాలలో తెలుగువారిని ప్రోత్సహించేందుకు ఏర్పాటుచేసిన ప్రముఖ సంస్థ అమెరికా తెలుగు సంఘం (ఆటా) గురువారం హైదరాబాద్ సిటీలో బిజినెస్ సెమినార్ 2021ను నిర్వహించింది. వ్యాపారాలకు సంబంధించిన ఆలోచనలను ప్రోత్సహించడం, యువ వాణిజ్యవేత్తలకు మెంటారింగ్, వెంచర్ క్యాపిటలిస్టులకు ఒక వేదిక కల్పించడం, స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటైంది. ఇందులో అమెరికా, భారతదేశాలకు చెందిన దాదాపు 100 మంది మెంటార్లు, వెంచర్ క్యాపిటలిస్టులు, వాణిజ్యవేత్తలు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.
ఆటా వేడుకల బిజినెస్ కమిటీ చైర్మెన్ కాశీకొత్త మాట్లాడుతూ.. 'ఈ బిజినెస్ సెమినార్ ఎజెండా బహుముఖం. అమెరికాలో స్థిరపడిన తెలుగు వాణిజ్యవేత్తలు, తెలంగాణలోని వ్యాపారవేత్తల మధ్య అనుసంధానం, అనుబంధం పెంచడం, భారతదేశంలో.. ముఖ్యంగా తెలంగాణలోని స్టార్టప్ కంపెనీలకు మెంటారింగ్ చేసి, వాటిలో పెట్టుబడులు పెట్టడం, ఖమ్మం, వరంగల్, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్ లాంటి టైర్-2 నగరాలకు మరిన్ని కంపెనీలను ఆకర్షించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యాలు' అన్నారు.
సెమినార్ గురించి అమెరికా తెలుగు సంఘం కాన్ఫరెన్స్ సలహా కమిటీ చైర్ జయంత్ చల్లా మాట్లాడుతూ... 'తెలుగు వాణిజ్యవేత్తలు అమెరికాతో పాటు ప్రపంచమంతా మంచి గుర్తింపు పొందుతున్నారు. భారత్-అమెరికా భాగస్వామ్యాలను ప్రోత్సహించి, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వాణిజ్యవేత్తలను ప్రోత్సహించడానికి ఈ ఆటా బిజినెస్ సెమినార్ ఒక మంచి ప్రయత్నం. 2014 నుంచి హైదరాబాద్‌లో ప్రతి రెండేళ్లకోసారి ఆటా ఇలాంటి సెమినార్లు నిర్వహిస్తోంది. వాటి ద్వారా ఇప్పటివరకు భారతీయ స్టార్టప్‌లలో దాదాపు 20 మిలియన్ డాలర్లు (రూ.150 కోట్లకుపైగా) పెట్టుబడులు వచ్చాయి. ఈ బిజినెస్ సెమినార్ల వల్ల పలు సంస్థలు టైర్-2 నగరాలకు తరలాయి. ఖమ్మం పట్టణంలో టి-హబ్ ప్రారంభించడం ఆటా బిజినెస్ కో- చైర్ లక్ష్చేపూరి సాధించిన ఓ అతిపెద్ద విజయం' అని చెప్పారు.