Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గౌడ జన హక్కుల పోరాట సమితి (మోకుదెబ్బ) జాతీయ కమిటీ డిమాండ్
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
గౌడ ఆత్మ గౌరవ భవనాన్ని సొసైటీగా ఏర్పాటు చేయాలని గౌడ జన హక్కుల పోరాట సమితి (మోకు దెబ్బ) జాతీయ అధ్యక్షులు అమరవేణి నర్సా గౌడ్, ప్రధాన కార్యదర్శి రాగుల సిద్దిరాములు గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం మోకు దెబ్బ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని కులాలకు ఆత్మ గౌరవ భవనాల పేరిట ఇచ్చిన దానిలో భాగంగా గౌడ కులానికి 5 ఎకరాల భూమి, రూ.5 కోట్లు గౌడ కులస్తుల అభ్యున్నతి కోసం కేటాయించిన దానిని సొసైటీగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 40 లక్షల గౌడ కులస్తులను భాగస్వామ్యం చేస్తూ అందరి హక్కుగా భావితరాల భవిష్యత్ కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలం, రూ.5 కోట్ల రూపాయలను కొందరు వ్యక్తులు స్వప్రయోజనాల కోసం సొసైటీకి కాకుండా ట్రస్ట్‌గా ఏర్పాటు చేసి మొత్తం ఆస్తిపై కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. సొసైటీలో గౌడ కులస్తుందరికి హక్కు ఉంటుందన్నారు. అదే ట్రస్టుగా కొనసాగితే కొంతమంది ఆస్తిగా మారే ప్రమాదముందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్యం వెంటనే స్పందించి, గౌడ సొసైటీగా ఏర్పాటు చేసి, ట్రస్టును బేషరతుగా రద్దు చేయలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దీని వెనుక ఉన్న కుట్రను రాష్ట్రంలోని గౌడ కులస్తుల ముందు బహిర్గతం చేస్తామని, రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సమితి రాష్ట్ర కార్యదర్శి అనంతుల రమేష్ గౌడ్, న్యాయవాది బాలసామి సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.