Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న స్వీపర్లు, స్కావెంజర్లను వెంటనే విధుల్లోకి తీసుకుని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వ పాఠశాలల స్వీపర్ల, స్కావెంజర్ల వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం హిమాయత్‌నగర్‌లోని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయంలో ఉద్యోగ భద్రత, జీతాల పెంపుదల అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు వై.కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 26 వేల పాఠశాలల్లో 26 వేల మంది కనీసం స్కావెంజర్లు పని చేయాల్సి ఉందని గుర్తు చేశారు. రెండేండ్లుగా స్కావెంజర్లను ప్రభుత్వం నియమించడం లేదన్నారు. హెడ్ మాస్టర్ సొంత ఖర్చులతో స్వీపర్లను నియమించుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి నెలకొందన్నారు. స్కావెంజర్లు లేక పాఠశాలలు అపరిశుభ్రతకు నిలయాలుగా మారాయని ఆరోపించారు. వారికి కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్.బోస్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్యం బాగుండాలంటే స్వీపర్లు, స్కావెంజర్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. 8 గంటల పాటు పని చేస్తున్న వారిని ఫుల్ టైమ్ వర్కర్లుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. స్వీపర్లు, స్కావెంజర్లు తమ హక్కులకై వివిధ రూపాల్లో సాగించనున్న ఉద్యమంలో భాగంగా జనవరి 25న తెలంగాణలోని 33 జిల్లాల్లో సదస్సులు, రౌండ్ టేబుల్ సమావేశాలు, 27న సంతకాల సేకరణ చేసి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచాలని తమ సమావేశం నిర్ణయించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తిరోగమన విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 23, 24 తేదీలలో సమ్మె నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో శ్రామిక మహిళా ఫోరం అధ్యక్షురాలు పి.ప్రేంపావని, మహిళా సమాఖ్య ఉపాధ్యక్షురాలు ఛాయాదేవి, ఏఐటీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండీ యూసుఫ్, యూనియన్ ప్రధాన కార్యదర్శి టి.సమ్మయ్య, నాయకులు నర్సింహా, తిరుపతి, బోయిన ప్రసాద్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.