Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీఎస్పీ స్టేట్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ-హైదరారాబాద్
బడుగు, బలహీన వర్గాల్లో ఆత్మగౌరవం ఉంటేనే బహుజన రాజ్యం వస్తుందని, హుజూరాబాద్ ఎన్నికల్లో కూడా అదే జరిగిందని బీఎస్పీ స్టేట్ కో ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గురువారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో కురుమ యువ చైతన్య సమితి (కేవైసీఎస్ )ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రాజ్యం మనచేతుల్లోకి రావాలని పోరాటం చేస్తున్నానని, అందుకే బానిసత్వం జోలికి పోలేదని చెప్పారు. కొందరు ఐఏఎస్, ఐపీఎస్ లాగా తాను కూడా కాళ్లుమొక్కితే ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే పదవి వచ్చి ఉండేదని, అలాంటప్పుడు మనకు ఆత్మ గౌరవం ఎక్కడ ఉంటుందని అన్నారు. నేటికీ దళిత సమాజంపైనే దాడులు జరుగుతున్నాయన్నారు. సామాజికంగా ప్రజలు చైతన్యం కావల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో పేద పిల్లలు చదువుతున్న హాస్టళ్లలో సౌకర్యాలు, ఉపాధ్యాయులు ఎందుకు లేరని ప్రశ్నించారు. అలా కాదని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. ఇప్పటికి పిల్లలకు నోట్‌బుక్స్, కప్పుకోవడానికి దుప్పట్లు కూడా లేవన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలకు 60 శాతం స్కూల్ భవనాలు లేవన్నారు. టాయిలేట్స్ లేకపోవడం వల్లనే 50 శాతం విద్యార్థినీలు స్కూల్స్ మానివేశారని చెప్పారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బీసీ లంటే ఓట్లు వేసే యంత్రాలుగానే ఉన్నారని విమర్శించారు. బడుగు బలహీన వర్గాలంతా ఐక్యమై రాజ్యాధికారి కోసం రాజీలేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కేవైసీఎస్ అధ్యక్షులు కొండె శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జకృష్ణ, కురుమ సంఘం బిల్లులు ఉపాధ్యక్షులు క్యామ మల్లేశం, రాష్ట్ర నాయకులు దీర్ల ఐలయ్య, కనకాల శ్యాచురుమ, కె . పోచయ్య, ఎర్ర సత్యనారాయణ, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.