Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజకీయాలు మాని రైతులను ఆదుకోండి
అన్ని రకాల ఆహార ఉత్పత్తులు కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే
ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షులు పోలాడి రామారావు
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓట్ల రాజకీయాల్లో పడి అన్నదాతలను విస్మరిస్తూ ధాన్యం సేకరణ, కొనుగోళ్ల విషయంలో ఒకదానిపై ఒకటి నెపం నెట్టివేసుకుంటూ రైతులను నట్టేట ముంచుతున్నాయని, రాజకీయాలు మాని అన్నదాతలను ఆదుకోవాలని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షులు, రైతు ఉద్యమ నేత పోలాడి రామారావు డిమాండ్ చేశారు. శుక్రవారం బషీర్ బాగ్‌లో ఓసీ సమాఖ్య రాష్ట్ర కార్యాయలంలో సమాఖ్య రాష్ట్ర నాయకులు, రైతు, ప్రజా సంఘాల ప్రతినిధులతో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను కొనాల్సిన బాధ్యత కేంద్రానిదైతే, ఉత్పత్తులను సేకరించాల్సిన బాధ్యత మాత్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందన్నారు. దేశంలో తిండిలేక ఆకలితో రోజుకు 7 వేల మంది, సంవత్సరానికి 25 లక్షల మంది ఆకలితో చనిపోతున్నారని స్వయంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి తెలుపడం ఆందోళన కలిగించే పరిణామమన్నారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆకలికి ఆహుతై పోతున్న ప్రజలను పట్టించుకోకుండా రాజకీయాలు చేయడం దారుణమన్నారు. ఓవైపు ఎఫ్‌సీఐ గిడ్డంగులు ఆహార ధాన్యాలతో నిండి ఉన్నాయని, ఒప్పందం మేరకే పంటల ఉత్పత్తులను కొనుగోలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతూ వస్తుండగా, తెలంగాణలో అధిక దిగుబడుల కారణంగా ఒప్పందాలను పక్కనపెట్టి మొత్తం ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తుందన్నారు. ఈ రెండు ప్రభుత్వాలు ఓట్ల రాజకీయాల్లో పడి అన్నదాతను విస్మరిస్తున్నాయని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలు మాని యాసంగి వరి ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యుత్ సంస్కరణ బిల్లు ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే వెనక్కి తీసుకోవాలని, రైతులు పండించిన అన్ని రకాల పంటలకు కనీస మద్దతు ధర లభించేలా చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేకపోతే రైతు, ప్రజా సంఘాలను కలుపుకుని వచ్చే నెలలో భారీ ఎత్తున సమాఖ్య ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఓసీ సమాఖ్య, రైతు, ప్రజా సంఘాల నాయకులు గోపు గోపాల్ రెడ్డి, సరిగాని ఎల్లారెడ్డి, జేడీ వాసు, బుర్రా రంజిత్, తాటిపల్లి శ్రీనివాస్, కల్వకుంట్ల రామచందర్ రావు, తోట శ్రీనివాస్, ఉమ్మెంతుల శ్యామసుందర్ రెడ్డి, విశ్వేశ్వరరావు, మండల ఓదెలు, తాళ్లపల్లి సంపత్ తదితరులు పాల్గొన్నారు.