Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
మహిళల ఆర్థిక అభ్యున్నతికి చేయూతనందిస్తున్నట్లు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. గాంధీనగర్ డివిజన్ నేతాజీ నగర్ బస్తీ మహిళలకు పొదుపు సంఘం నూతన పుస్తకాల అందజేత కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముషీరాబాద్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ పావని వినరు కుమార్ హాజరై పుస్తకాలను అందజేశారు. లక్ష్మీగణపతి పొదుపు సంఘం, సాయి బాబా మహిళ పొదుపు గ్రూప్ పేరుతో బస్తీ మహిళలు ఏర్పాటు చేసుకున్న పొదుపు సంఘాలకు వారికి ఆర్థికంగా అభివద్ధి చెందడానికి ప్రభుత్వం ద్వారా రుణాలను మంజూరు చేయించాలన్నారు. మహిళలలు తమంతట తాము చిన్న వ్యాపారాలకు అవకాశం కల్పించే దిశగా పొదుపు సంఘం రుణాలు సహాయపడతాయని తెలిపారు. కార్పొరేటర్ పావని వినరు కుమార్ మాట్లాడుతూ డివిజన్ మహిళలకు అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలలో వారికి అవకాశం కల్పించే విధంగా ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నగర యువ నాయకులు వినరు కుమార్, ఉమేష్, ప్రసన్న, మహిళ గ్రూప్ సభ్యులు, అలేఖ్య, సంధ్య, సునీతా, అనుమ, ఉషారాణి, చేతన్య, మీన, లక్ష్మి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.