Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ సాహితీవేత్త కాత్యాయనీ విద్మహే తెలంగాణ సారస్వత పరిషత్‌లో ప్రసంగం
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
చుట్టూ ఉన్న జీవితాన్ని ఎప్పటికప్పుడు చదవడం, నేర్చుకోవడం, దష్టికోణాన్ని ఏర్పరుచుకోవటం అనే ఆలోచనతో సాగుతున్నానని ప్రముఖ సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఆచార్య కాత్యాయనీ విద్మహే అన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్ డా. దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో జరుగుతున్న పరిణతవాణి ప్రసంగ పరంపరలో 4వ రోజున ఆమె తన జీవితం, సాహిత్యంపై ప్రసంగించారు. 1955 నవంబర్ 3న ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలోని మైలవరంలో అమ్మమ్మవారింట జన్మించానని, నాన్న కేతవరపు రామకోటిశాస్త్రి గుడివాడ ఎ.ఎన్.ఆర్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న కారణంగా అమ్మ అక్కడికి తీసుకువెళ్లిందని చెప్పారు. అక్కడ తన మొదటి పుట్టినరోజు సందర్భంగా బహుమతిగా ఇచ్చిన డా.కె.శ్రీదేవి రచించిన 'కాలాతీతవ్యక్తులు' నవల తరువాతి కాలంలో తనను బాగా ప్రభావితం చేసిందని పేర్కొన్నారు. నాన్న పీహెచ్‌ఐ కోసం వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయానికి రావడంతో తాను తన 5వ ఏట వరంగల్ వచ్చి అనంతర జీవితం అంతా అక్కడే గడుపుతున్నానని కాత్యాయనీ చెప్పారు. బీఏ చదివినప్పుడు మొదటిసారిగా స్త్రీవాదం, మార్క్సిజం చెవిన పడ్డాయని, తర్వాత లోతైన అధ్యయనంతో అవి జీవితంలో భాగమయ్యాయని అన్నారు. కాకతీయ తెలుగుశాఖలో బుచ్చిబాబు 'చివరకు మిగిలేది' నవలపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందానని చెప్పారు. శాఖాధిపతిగా ఉండగా తెలంగాణ సాహిత్యంపై సదస్సు నిర్వహించానని, సదస్సు తీర్మానం మేరకు తెలంగాణ సాహిత్యంపై ఎంఏ తెలుగులో మొట్టమొదటి సారిగా ఒక పేపర్ ప్రవేశపెట్టామని కాత్యాయనీ విద్మహే వివరించారు. పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి ప్రసంగిస్తూ పరిణతవాణి 85వ ప్రసంగానికి విచ్చేసిన కాత్యాయనీ విద్మహే ప్రాచీనతను, ఆధునీకతను సమన్వయించుకున్న విమర్శకురాలని తెలిపారు. ఏది రాసినా, మాట్లాడినా ప్రామాణికత ఉంటుందని అన్నారు. ప్రధాన కార్యదర్శి డా. జుర్రు చెన్నయ్య స్వాగతోపన్యాసం చేశారు. శుక్రవారం ప్రముఖ సాహితీవేత్త డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి పరిణతవాణి ప్రసంగం ఉంటుందని తెలిపారు. ట్రస్టు సభ్యురాలు డా. సి. వసుంధర తదితరులు పాల్గొన్నారు.