Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
తెలంగాణ ఆవిర్భావం తర్వాత నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలు సాహితీ వేత్తలు, కవులకు ప్రేరణనిచ్చాయని సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరి గౌరీశంకర్ అన్నారు. శ్రీత్యాగరాయ గాన సభలోని కళా సుబ్బారావు కళా వేదికపై గురువారం చందన ప్రచురణలు నిర్వహణలో వాసరచెట్ల జయంతి రచించిన నేల విమానం' 'తురాయి పూలు' కవితా సంపుటిల ఆవిష్కరణ సభ జరిగింది. ఈ సందర్భంగా గౌరీశంకర్ మాట్లాడుతూ జయంతి కవితా రచన ప్రపంచ తెలుగు మహా సభలు తర్వాతనేనని గుర్తు చేశారు. ప్రతి సంఘటనను శక్తి వంతంగా కవితల్లో బంధించారని వివరించారు. తురాయి పూలు సంపుటిని ఆవిష్కరించిన సాహిత్య అకాడమీ పూర్వ చైర్మెన్ డాక్టర్ నందిని సిద్ధ రెడ్డి మాట్లాడుతూ జయంతికి జీవితం కన్నీళ్లు ప్రేమించడం నేర్పింది. కానీ జీవితం పట్ల అనురక్తి వాస్తవికత పట్ల ఆసక్తితో కవిత్య రచనను ప్రాణ శక్తిగా మార్చుకొందని అభివర్ణించారు. నేల విమానం సంపుటిని ఆవిష్కరించిన మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ రైతులను తురాయి పూలుగా సంకేతించిన జయంతి కవి బలహీనుల పక్షపాతిగా ఉండాలని ఆకాంక్షించారని వివరించారు. అధ్యక్షత వహించిన తెలంగాణ రచయితలు సంఘం అధ్యక్షులు డాక్టర్ నాలేశ్వరం శంకరం మాట్లాడుతూ గానుగలో నూనె గింజలు నుంచి నూనె తీసే గానుగ కులం కు చెందిన జయంతి అక్షర గింజల నుంచి సారవంతమైన కవితా నూనెను అందించారని అభివర్ణించారు. గాన సభ అధ్యక్షులు కళా జనార్దన మూర్తి, కవి జీ.దేవేందర్, తదితరులు సభలో పాల్గొన్నారు.