Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
ఎన్నో సందర్భాల్లో మానవత్వాన్ని చాటుకున్న తెలంగాణ ఆల్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తనుగుల జితేందర్ రావు.. కష్టాల్లో ఉన్న మరో జర్నలిస్ట్ కుటుంబానికి భరోసాగా నిలిచారు. తన తల్లి గుండెకు చికిత్స చేయించేందుకు ఆర్థిక స్థోమత లేక ఓ పాత్రికేయుడు విలవిల్లాడుతున్న తరుణంలో 'నేనున్నానంటూ' ఆపద్బాంధవుడిలా ముందుకొచ్చారు. తోటి జర్నలిస్టుల సహాయంతో విషయం తెలుసుకున్న జితేందర్ రావు ఆ అవ్వ గుండెకు ఆపరేషన్ చేయించి పునర్జన్మనిచ్చారు. వివరాల్లోకెళ్తే.. సంగారెడ్డి జిల్లా మునిపల్లి శ్రీనివాసులు అనే జర్నలిస్టు తల్లి గుండెనొప్పితో కొంతకాలంగా బాధపడుతున్నది. వైద్యం చేయించడానికి ఆర్థిక స్థోమత లేక శ్రీనివాసులు ఆవేదనతో కుంగిపోయాడు. తోటి విలేకరుల సహాయంతో ఫోన్ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న డాక్టర్ తనుగుల జితేందర్ రావు.. ఆ తల్లి పరిస్థితి తెలుసుకుని చలించిపోయాడు. బాధిత కుటుంబంలో మనోధైర్యం నింపి, హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో అన్నిరకాల చికిత్సలు చేయించేందుకు కృషి చేశారు. ఇటీవల డిసెంబర్ 31న గుండె ఆపరేషన్ కూడా చేయించారు. ప్రస్తుతం ఆ అమ్మ ఆరోగ్యం కుదుటపడుతున్నది. అండగా నిలిచిన జితేందర్ రావుకు ఆ జర్నలిస్టు కుటుంబ సభ్యులు, బంధువులు కృతజ్ఞతలు తెలియజేశారు. బుధవారం టీఏజేఎఫ్ జర్నలిస్ట్ నాయకులు శ్రీనివాస్ ఇంటికి వెళ్లి ఆ తల్లిని పరామర్శించారు. అనంతరం డాక్టర్ జితేందర్ రావ్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఏజేఎఫ్ జిల్లా ఇన్చార్జ్ చాపల సత్యం, జర్నలిస్ట్ నాయకులు నర్సింలు, షేక్ మహబూబ్, వీరేశం, నరసింహులు, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.