Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆరోపణ
నవతెలంగాణ- బేగంపేట్
యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో పేషెంట్ మృతి చెందాడు. ఆస్పత్రి యాజమాన్యం, డాక్టర్ల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని మృతుని బంధువులు, కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి ఎదుట గురువారం ఆందోళనకు దిగారు. మతుడి కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... కార్వాన్కు చెందిన కె. రవి (28) రైల్వే కాంట్రాక్టర్వద్ద కార్మికుడిగా పనిచేస్తున్నారు. 12 రోజుల కిందట రైల్వే పనుల్లో భాగంగా శంషాబాద్‌లో విద్యుత్ పోల్ఎక్కి పనిచేస్తుండగా కరెంటుషాక్ తగిలి రవి కిందపడిపోయాడు. గాయాలపాలైన ఆయనను గత సంవత్సరం డిసెంబర్ 22న సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చేర్చారు. తలకు తీవ్రంగా గాయాలు కావడంతో చికిత్స అందించారు. జనవరి ఫస్టున కోలుకోవడంతో జనరల్‌వార్డుకు షిఫ్టు చేశారు. కుటుంబ సభ్యులతో బాగానే మాట్లాడుతుండేవాడు. అయితే జనవరి 2వ తేదీన సాయంత్రం 6 గంటల సమయంలో విపరీతమైన జ్వరం వచ్చింది. ఈ విషయాన్ని రోగి బంధువులు డాక్టర్ల దృష్టికి తీసుకెళ్లానా రెండు గంటలపాటు పట్టించుకోలేదని, అంతలోనే పేషెంట్‌కు ఫిట్స్ వచ్చాయని తెలిపారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో పరిస్థితి సీరియస్‌గా అయిందన్నారు. అప్పటి ఆస్పత్రిలోనే ట్రీట్మెంట్ కోసం ఉన్నాడని, గురువారం ఉదయం చనిపోయాడని, డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా రవి మృతి చెందాడని మృతుడి బంధువులు ఆరోపించారు. జ్వరం ఫిట్స్ వచ్చినప్పుడే డాక్టర్లు స్పందించి ఉంటే తమ బావ బతికేవాడని మృతి బామ్మర్ది సురేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. రూ .10 లక్షలు కట్టించుకుని, చివరికి డెడ్‌బాడీని తమకు అప్పగించారని తెలిపారు. పోలీసుల జోక్యంతో మృతుడి బంధువులు ఆందోళన విరమించారు. మృతుడు రవికి భార్య, ఓ కొడుకు, ఓ కూతురు ఉన్నారు.
ఎటువంటి నిర్లక్ష్యమూ లేదు
పేషెంట్ రవి మృతికి సంబంధించి ఎటువంటి నిర్లక్ష్యం చేయలేదని డాక్టర్లు తెలిపారు. ప్రమాదంలో రవి తలకు తీవ్ర గాయాలై మెదడు బయటకు వచ్చిందని, అతనిని బతికించేందుకు ఎంత కష్టపడినా ప్రయోజనం లేకపోయిందని చెప్పారు. మెదడుకు ఇన్ఫెక్షన్ సోకడంతో పేషెంట్ కోలుకోలేకపోయాడన్నారు. చికిత్సకోసం మృతుడి బంధువులు రూ .10 లక్షలు చెల్లించామని చెప్పడంలో నిజం లేదని, కేవలం రూ. రూ .2.50 లక్షలు మాత్రమే చెల్లించారని చెప్పారు.