Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
న్యూఇయర్ వేడుకల్లో డ్రగ్స్ విక్రయించి సొమ్ముచేసుకోవాలన్న ప్లాన్‌లో భాగంగా మూడు వేర్వేరు ముఠాలు ముంబయి నుంచి హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను తీసుకొచ్చాయి. పోలీసుల నిఘా ఉండడంతో రహస్యప్రాంతాల్లో నిల్వ చేశారు. వేడుకలు ముగిశాక విక్రయాలు ప్రారంభించారు. సమాచారం అందుకున్న టాస్క్ఫోర్సు పోలీసులు డ్రగ్స్‌సరఫరా ముఠాల గుట్టు రట్టు చేశారు. నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి రూ.20 లక్షల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్సు డీసీపీ రాధాకిషన్‌రావుతో కలిసి పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ముంబాయికి చెందిన ఇమ్రాన్ బాబు షేక్, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన నూర్ మాహ్మద్ ఖాన్లు ఒక ముఠాగా ఏర్పాడ్డారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి రూ.8.30 లక్షల విలువగల 83 గ్రాముల కొకైన్‌తోపాటు రెండు సెల్ఫోన్లు, రూ.30 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ కైసర్ హుస్సేన్, ముంబాయికి చెందిన సయ్యద్ రషీద్ హైమద్ ఖాన్లు ఒక ముఠాగా ఏర్పడి సిటీలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఈ ముఠా నుంచి 15 గ్రాముల కొకైన్, 45 గ్రాముల ఎండీఎంఈ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.6 లక్షలు ఉంటుంది. ఈ ముఠాలు ముంబాయికి చెందిన టోనీ అనే డ్రగ్స్ స్మగ్లర్‌తో చేతులు కలిపాయి. గ్రాము కొకైన్ మూడువేలకు కొనుగోలు చేసి, సిటీలో రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు విక్రయిస్తున్నారు.దమ్మాయిగూడకు చెందిన ఏఆర్ అనిరుద్, మీర్‌పేట్‌కు చెందిన కె.అవినాష్ తరుచూ గోవాకు వెళ్లేవారు. ఈ క్రమంలో డ్రగ్స్‌కు బానిసలైన విక్రయదారులుగా మారారు. అక్కడి నుంచి తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న నిందితులు సిటీలో రూ.4వేల నుంచి రూ.10వేల వరకు ఒక గ్రాము డ్రగ్స్‌ను విక్రయిస్తున్నారు. ఈ ముఠాను అరెస్టు చేసిన పోలీసులు నిందితుల నుంచి రూ.1,66,000 విలువగల 27గ్రాముల పిల్స్, 17 గ్రాముల ఎల్డీని స్వాధీనం చేసుకున్నారు.
కౌన్సిలింగ్ ఇచ్చాం.. కఠిన చర్యలు తప్పవు
నైజీరియాకు చెందిన డ్రగ్స్ స్మగ్లర్ టోనీ ముంబాయికి చెందిన ఇమ్రాన్ షేక్‌తో కలిసి దేశవ్యాప్తంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని సీపీ సీవీఆనంద్ తెలిపారు. వీరు ఏ రాష్ట్రానికి వెళ్లినా ఓయో లాడ్జిల్లో ఉంటారన్నారు. వారికి చెందిన మూడు ముఠాలను అరెస్టు చేశామన్నారు. వారితో సంబంధమున్న వారిని, డ్రగ్స్ వినియోగదారులను సైతం గుర్తించామని తెలిపారు. డ్రగ్స్ వాడేవారిలో 18 నుంచి 30 ఏండ్ల యువకులు ఉన్నారని చెప్పారు. వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతానికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించామన్నారు. మరోసారి పట్టుబడితే డ్రగ్స్ సరఫరాదారులతోపాటు, వినియోగ దారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. ముంబాయి పోలీసులతో కలిసి టోనీని అరెస్టుచేస్తామన్నారు. నిందితులను, ముఠాలను గుర్తించి అరెస్టు చేసినందుకు టాస్క్ఫోర్సు పోలీసులను సీపీ ప్రత్యేకంగా అభినందించారు. సీఐ నాగేశ్వర్రావుతోపాటు పలువురికి రివార్డులను అందజేశారు.