Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
పోలీసులు సైబర్ మోసాలపై మరింత పరిశోధన చేయాలనీ, అవి వాటికి అడ్డుకట్ట వేసేలా ఉండాలనీ, అందుకోసం ఇన్వెస్టిగేషన్ స్కిల్స్‌ను మరింత మెరుగుపర్చుకోవాలని హైదరాబాద్ సీపీ సి.వి.ఆనంద్ సూచించారు. 193 మంది హైదరాబాద్ సిటీ పోలీస్ ప్రొబేషనరీ సబ్-ఇన్ స్పెక్టర్లకు ఏడు రోజుల పాటు జరిగే ఓరియంటేషన్ కోర్సును రాష్ట్ర పోలీసు అకాడమీలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం ఆయన పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రాసిక్యూషన్, ఫంక్షనల్ వర్టికల్స్-ఎస్ వోపి, హైకోర్ట్, సుప్రీంకోర్టు ముఖ్యమైన కేసులు, చట్టాలు, సైబర్ మోసాల పరిశోధన, హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్, వీవీఐపీ సెక్యూరిటీ, మాబ్ సైకాలజీ, క్రౌడ్ కంట్రోల్ కోసం ఇన్వెస్టిగేషన్ స్కిల్‌ను మెరుగుపరచుకోవడమేగాక ఈ ఓరియంటేషన్ కోర్సు ప్రధాన లక్ష్యమన్నారు. గతేడాది నవంబర్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న ప్రొబేషనరీ సబ్-ఇన్స్పెక్టర్లు సిటీలో రోజువారీ పోలీసింగ్‌కు అవసరమైన ముఖ్యమైన అంశాల గురించి తెలియజేయడానికి ఏడు రోజుల ఓరియంటేషన్ కోర్సు ఉపయోగపడుతుందని చెప్పారు. మహిళలపై నేరాల విచారణ, ట్రాఫిక్ నిర్వహణ, ఐటీ కార్యక్రమాలు, ఆన్లైన్ దరఖాస్తుల వినియోగం, వ్యక్తిత్వ వికాసం, ప్రవర్తన సీసీఏ నియమాలు ఈ ఏడు రోజుల ఓరియంటేషన్ కోర్సులో భాగమని అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అకాడమీ డైరెక్టర్ వి.వి. శ్రీనివాసరావు, జాయింట్ పోలీస్ కమిషనర్ కార్తికేయ, డైరెక్టర్ రమేష్ నాయుడు, సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపాల్ మద్దిపాటి శ్రీనివాస్ రావు, సీపీటీసీ, హైదరాబాద్, టీఏపీఏలు, ఇతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.