Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆంధ్రజ్యోతి సంపాదకులు కె. శ్రీనివాస్
నవతెలంగాణ-కల్చరల్
పత్రికా నిర్వహణలో వచ్చిన మార్పుల కారణంగా సాంస్కృతిక వార్తలకు ప్రాధాన్యత తగ్గిందని ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్ అన్నారు. సాంస్కృతిక రంగం ప్రత్యేక ప్రపంచమని చెప్పారు. శ్రీత్యాగరాయ గాన సభలోని కళా సుబ్బారావు కళా వేదికపై శనివారం భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కళా జ్యోతి సాంస్కృతిక సంస్థ నిర్వహణలో ప్రముఖ సాంస్కృతిక విలేకరి చాగంటి కపాలేశ్వరరావు జయంతి సందర్భంగా సాంస్కృతిక విలేకరులు అక్కిరాజు జనార్ధన రావు, రామమోహన్, ఆర్వీ రమణ, సతీష్, సంగీత కళాకారులు ఉదరుకుమార్, రఘునందన్లకు సి.కె.స్మారక పురస్కారాలను శ్రీనివాస్ బహుకరించి మాట్లాడారు. చాగంటి సంగీత, నృత్య, నాటక ఇతర కళా ప్రదర్శనలు విశ్లేషణాత్మకంగా ప్రధాన పత్రికల్లో రాసేవారని వారి ఆదర్శంగా ఇటీవల మృతి చెందిన జీ.ఎల్.ఎన్. మూర్తి వంటివారు అందిపుచ్చుకున్నారని వివరించారు.
సాంస్కృతిక విలేకరులకు ఆయా రంగాల్లో ప్రతిభ ఉండకపోయినా కనీస అవగాహన ఉండాలని శ్రీనివాస్ సూచించారు. పత్రికలో స్థలాభావంవల్ల సమీక్ష విశ్లేషణలకు ఆవకాశం లేదని, డిజిటల్ మీడియాలో ప్రాధాన్యత పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తపరిచారు. గాన సభ అధ్యక్షులు కళా జనార్ధన మూర్తి అధ్యక్షత వహించిన సభలో తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు డాక్టర్ నాలేశ్వరం శంకరం, సంగీతజ్ఞులు డాక్టర్ శేషాద్రి, సి.కె.కుమార్లు చాగంటి శశిధర్ పాల్గొన్నారు. సంస్థ నిర్వాహకులు రవిశర్మ స్వాగతం పలికిన సభకు తొలుత సంగీత కళాకారులు త్యాగరాజ కీర్తనలు ఆలపించారు.