Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
సాహిత్య అకాడమీ పద్య, వచన తదితర సాహితీ ప్రక్రియల రచయితలకు, సంస్కృత, సంప్రదాయ భిన్న భావాల సాహితీవేత్తలకు స్వాగతం పలుకుతుందని, అందరి వేదికగా విస్తృత స్థాయిలో సాహిత్య సాంస్కృతిక వారసత్వాన్ని నిలిపే విధంగా ఉన్నత ఆశయంతో పని చేస్తుందని అకాడమీ అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ లక్ష్యంతోనే అకాడమీని ఏర్పాటు చేశారని అన్నారు.
రవీంద్రభారతిలోని అకాడమీ కార్యాలయం లో శనివారం అధ్యక్షులుగా నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన గౌరీశంకర్ పత్రికా విలేకరులతో ఇష్టాగోష్ఠి సమావేశంలో మాట్లాడారు. అకాడమీ కార్యక్రమాలు గురించి తెలిపారు. వివిధ వృత్తులకు చెందిన సాహిత్యం కథ, కవిత, వచనం ఏ విధమైన ప్రక్రియలో ఉన్నా ప్రోత్సహిస్తామని, ముందుతరాలకు ఆ వృత్తుల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. ప్రధానంగా తెలంగాణ మాండలికాలతో ఆక్స్ఫోర్డ్ నిఘంటువు వంటి పదకోశంను రూపిందిస్తామన్నారు. (తెలంగాణ ఆవిర్భా వానికి ముందు అప్పటి ప్రజాశక్తి దినపత్రికకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలోను ఈ మాటను చెప్పారు) నిఘంటువు రూపకల్పన తెలంగాణ వచ్చిన తర్వాత కార్య రూపం దాల్చలేదని అడుగగా తెలుగు అకాడమీ, సాహిత్య అకాడమీ, తెలుగు విశ్వవిద్యాలయం, మూడు వ్యవస్థలు కలిసి పనిచేయాల్సిన బృహత్తర ప్రణాళిక అని, కేవలం భాషా పండితులు కాకుండా రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉన్న మాండలికాలను ప్రజల నుంచి సేకరించాల్సి ఉంటుందని గౌరీశంకర్ వివరించారు. అకాడమీ చేపట్టే మహత్తర కార్యక్రమంలో ఇది తొలి అడుగు అన్నారు. అకాడమీకి నిధుల కొరత లేదని, అవసరమైతే మరిన్ని నిధులు అడుగుతామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తెలంగాణలో రెండవ ప్రపంచ తెలుగు మహాసభల విషయంలో స్పందిస్తూ ఇది ప్రభుత్వంలోని అన్ని శాఖలకు సంబంధించిన అంశమని, ముఖ్యమంత్రి నిర్ణయంపై ఆధారపడి ఉందని అన్నారు.
కేజీ నుంచి పీజీ వరకు తెలుగు అమలు గురించి మాట్లాడుతూ... అన్ని కళాశాలల్లోను, వృత్తి విద్యా కళాశాల విద్యార్థులు సైతం పాల్గొనే విధంగా కార్యాచరణ రూపొందించి కోటి మందికి సంస్కృతి, భాషపట్ల అవగాహన కల్పిస్తామని వివరించారు. అకాడమీ నిర్వహణలో సాహితీ కార్యశాలలు నిర్వహించే అంశం పరిశీలిస్తామని తెలిపారు.