Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
నగరశివారు ప్రాంతంలో ఉన్న ఓ బార్ యాజమాన్యం మద్యం సేవించడానికి వచ్చిన కస్టమర్లపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మేడిపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని దర్బార్ బార్లో ఆదివారం రాత్రి బోడుప్పల్ సరస్వతినగర్‌కు చెందిన దంతూరి సాయికష్ణ అతని స్నేహితుడు టీ.సాయితో కలిసి మద్యం సేవించడానికి బార్‌కు చేరుకున్నారు. అనంతరం బిల్లు చెల్లించే విషయంలో ఎంఆర్పీ (మ్యాగ్జిమం రిటేల్ ప్రైజ్) రేటుకే బిల్లు ఇవ్వాల్సిందిగా కస్టమర్లు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బార్ యాజమాని ససేమిరా అనడంతో చెలరేగిన గొడవ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఎంఆర్పీ రేటు మాత్రమే చెల్లిస్తామని చెప్పడంతో సహించలేని బార్ యాజమాన్యం మరియు వారి సిబ్బంది వేయిటర్స్ కలిసి ఇనుపరాడ్లతో, కర్రలతో ఇష్టాను సారంగా విచక్షణరహితంగా దాడికి పాల్పడడంతో పదిగురిలో నలుగురికి గాయాలు కాగా, ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి పరిస్థితి విషమంగా మారిందని మేడిపల్లి పోలీసులు తెలిపారు. గాయాల పాలైన బాధితులను స్థానిక దవాఖానకు తరలించిన తరువాత కూడా వెంబడించి దాడి చేయడంతో ఒకరి పరిస్థితి విషమంగా మారిందని బాధితులు ఆరోపించారు. తీవ్రంగా గాయపడడంతో మెరుగైన చికిత్స కోసం బాధితున్ని దగ్గరలో ఉన్న ఉప్పల్‌లోని ప్రైవేటు దవాఖానకు తరలించారు. దాడికి పాల్పడిన బార్ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
బాధిత కుటుంబాల ధర్నా
దర్బార్ బార్లో దాడికి గురైన బాధిత కుటుంబసభ్యులు, స్థానికులు సోమవారం వరంగల్-హైద్రాబాద్ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న బార్ ముందు ధర్నా నిర్వహించారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం జరిగింది. దాడికి పాల్పడిన బార్ యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకుని, బార్ లైసెన్స్ రద్దు చేయాలని కోరుతూ మూడు గంటల పాటు ధర్నా. నిర్వహించారు. విషయం తెలుసుకున్న మల్కాజిగిరి ఏసీపీ శ్యాంసుందర్‌రావు, మేడిపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఏసీపీ శ్యాంసుందర్ రావు మాట్లాడుతూ... దాడికి పాల్పడిన వారు ఎంతటి వారైన చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేస్తామని బాధిత కుటుంబ సభ్యులకు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ మేరకు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దాడికి పాల్పడిన పలువురిని అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించనున్నట్లు ఆయన తెలిపారు. సీఐ అంజిరెడ్డి, డీఐ మక్బూల్ జానీ, ఎస్ఐ రఘురాం, చంద్రశేఖర్, ఉప్పల్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.
కఠిన చర్యలు తీసుకోవాలి ...
కస్టమర్లపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటనలో బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ తోటకూర వజ్రేష్ యాదవ్ డిమాండ్ చేశారు. బార్ నిర్వాహకుల చేతిలో గాయపడి హాస్పిటల్లో చికిత్సా పొందుతున్న సాయి కష్ణను పరామర్శించిన వజ్రేష్ యాదవ్ అతనికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా సంబంధిత శాఖ అధికారులు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని కోరారు.