Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
దేశానికే ఆదర్శంగా నిలిచిన గొప్ప పథకం రైతుబంధు కార్యక్రమం అని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం ఎన్టీఆర్ స్టేడియంలో పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుబంధు సంబురాల్లో శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రసంగించారు. వివిధ రంగులతో రూపొందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రమాలిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ప్రదర్శించిన గంగిరెద్దుల ఆటలు, పెద్ద ఎత్తున ముగ్గులు, గొబ్బెమ్మల ఏర్పాటు, చెరుకు గడల ప్రదర్శన సంక్రాంతి పండుగను సందడిని తలపించింది. ఈ సందర్భంగా శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం ద్వారా ఎనిమిది విడతలలో రూ.50వేల కోట్లు అందుకున్న శుభ సందర్భంలో రైతు సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ అన్నం పెట్టే రైతన్నకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహాయం రైతుబంధు, ముఖ్యమంత్రి కేసీఆర్ మదిలో నుంచి వచ్చిన పథకమే రైతుబంధు అన్నారు. పార్టీలకు, కుల మతాలకు అతీతంగా 63 లక్షల మంది రైతులకు రైతుబంధును తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నదని, సీజన్ రాగానే రైతుబంధు డబ్బులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో పడుతున్నాయిని చెప్పారు. కొంతమంది ఉచిత ఎరువులు అంటూ మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. పెద్ద కంపెనీలు తమ ఉద్యోగుల కోసం ప్రమాద బీమా మాత్రమే చేస్తాయని, కానీ ముఖ్యమంత్రి పెద్ద మనస్సుతో రైతుల సాధారణ మరణానికి కూడా జీవిత బీమా చేయించారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం అభివృద్ధి కోసం రెండు పంటలకు సాగునీరు, ఉచితంగా 24 గంటల కరెంటు, పండించిన పంటల కొనుగోలు జరుగుతున్నదని, తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఆత్మహత్యలు బాగా తగ్గాయని పేర్కొన్నారు. 'నేను స్పీకర్ హోదాలో రాజకీయాలు మాట్లాడడం సరికాదని, అయినప్పటికీ కొంతమంది ఇతర రాష్ట్రాల నాయకులు తెలంగాణకు వచ్చి విమర్శలు చేస్తున్నారు. వారు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు మీ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా? మీ దగ్గర కూడా రైతులు, కూలీలు, పేదల ఉన్నారు కదా. వారికి తెలంగాణ రాష్ట్రంలో కంటే ఎక్కువ సహాయం చేసి మాటలు అనండి. మీ రాష్ట్రాలలో కూడా రైతుబంధు, రైతుబీమా అమలు చేయండి. ఇంత కంటే ఎక్కువ నగదును అందించి అప్పుడు మాట్లాడండి. మీ రాష్ట్రాల్లో కూడా వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇవ్వండి. పేదింటి ఆడబిడ్డ పెండ్లికి కల్యాణలక్ష్మి ఇవ్వండి. రెండు పంటలకు సాగునీరు ఇవ్వండి. పనిలో పోటీి పడండి. అంతేకాని మాటలలో కాదు. ఉన్నత పదవుల్లో ఉన్నవారు హుందాగా మాట్లాడాలి. లేకపోతే పరువుపోతుంది'
అని అన్నారు.
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ రైతుకు ఓనాడు అప్పు పుట్టేది కాదని, పెట్టుబడి కోసం తిరిగే పరిస్థితి అన్నారు. కుల, మతాలకు అతీతంగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ఇప్పటి వరకు 50వేల కోట్లు సాయం చేశారని తెలిపారు. రైతులు ఆదుకోమని వస్తే మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ మీ రాష్ట్రంలో పిట్టల్లా కాల్చి చంపి రైతు హంతకుడిగా పేరు పొందావని గుర్తుచేశారు. రైతుబంధు సంబురాల్లో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మెన్ బి.వినోద్‌కుమార్, రైతుబంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టీఎస్ఎంఐడీసీ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, శాసనమండలి సభ్యులు ఎంఎస్.ప్రభాకర్, శాసనసభ్యులు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, దానంనాగేందర్, మాగంటి గోపినాథ్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.