Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట
గుండె జబ్బుతో బాధపడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వృద్ధుడికి దేశంలోనే మొట్టమొదటి సారిగా రెండు రకాల సంక్లిష్ట వైద్య ప్రక్రియలు ఒకే సారి నిర్వహించి ఆయన ప్రాణాలు కాపాడారు సన్ షైన్ వైద్యులు. సోమవారం సికింద్రాబాద్ సన్ షైన్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో హాస్పిటల్ కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ శ్రీధర్ కస్తూరి, కార్డియాలజీ సీనియర్ వైద్యులు డాక్టర్ శైలేందర్ సింగ్, డాక్టర్ విజయకుమార్‌రెడ్డి, డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ రాజారావు వివరాలు వెల్లడించారు. గత నెల 30వ తేదీన 77 ఏండ్ల ఓ వృద్ధుడు తీవ్ర అనారోగ్యం, కండ్లు తిరిగిపోవడం, స్పహ తప్పడం లాంటి సమస్యలతో హాస్పిటల్‌కు వచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించగా బహద్ధమని మూసుకుని పోవడం, గుండె కొట్టుకోవడంలో వేగం తగ్గిపోవడం వంటి సమస్యలు ఉన్నాయని గుర్తించారు. బహద్ధమనికి వాల్వ్ రీప్లేస్మెంట్ కోసం ఓపెన్ హార్ట్ సర్జరీతో పాటు గుండె వేగంలో తేడా సరిచేసేందుకు మరో శస్త్ర చికిత్స చేసి పేస్ మేకర్ అమర్చాల్సి ఉంటుంది. అయితే రోగి వయసు ఎక్కువగా ఉండటం మధుమేహం, రక్తపోటు, అధిక బరువు వంటి సమస్యలతో బాధపడుతుండటంతో అది సాధ్యం కాలేదు. ఈ పరిస్థితిలో ట్రాన్సక్యాథెటర్ ఎరోటిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్ ( టీఏవిఐ ) ప్రక్రియ ద్వారా తొడ రక్తనాళాల ద్వారా హృదయ కవాటం మార్చడం, గుండెలో పేస్ మేకర్ని అమర్చాలని వైద్యులు నిర్ణయించారు. ఈ నెల 2వ తేదీన సన్ షైన్ గుండె వైద్యుల బృందం విజయవంతంగా ఆ రోగికి రెండు ప్రక్రియలు ఒకేసారి పూర్తి చేశారు. గతంలో వేగం సరిచేసేందుకు కుడివైపు చాతి చర్మం కింద వైర్లతో కూడిన పేస్ మేకర్ ఆమర్చేవారు. అయితే అత్యాధునికంగా ఇటీవల అందుబాటులోకి వచ్చిన రెండు గ్రాముల కంటే తక్కువ బరువు గల ఏవి మైక్రాలీడ్స్ ( వైర్లు లేని) పేస్ మేకర్‌ను అమార్చారు. పదేండ్లవరకు ఈ పేస్ మేకర్ పని చేస్తూ గుండె వేగాన్ని నియంత్రిస్తుంది. అటు తర్వాత మళ్లీ దీన్ని మార్చాలని డాక్టర్ శ్రీధర్ కస్తూరి చెప్పారు.