Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
మేడ్చల్ జిల్లాలో ఫౌండేషన్ ఏర్పాటు చేసి వికలాంగులకు బిక్షాటన చేయిస్తున్న స్వయం కృషి వికలాంగుల ఫౌండేషన్, శ్రీ కృష్ణ ఫౌండేషన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం వికలాంగుల హక్కుల జాతీయ వేదిక మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ నరసింహా రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వెంకట్, ఎం. అడివయ్య మాట్లాడుతూ మేడ్చల్ జిల్లా పరిధిలో తనకు ఉపాధి కల్పిస్తామని మాయ మాటలు చెప్పి బిక్షాటన చేయిస్తున్న పౌండేషన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్వయంకృషి వికలాంగులు ఫౌండేషన్, శ్రీకృష్ణ పౌండేషన్లతోపాటు అనేక ఫౌండేషన్ వాళ్ళు వికలాంగులతో గ్రూపులు ఏర్పాటు చేసి రాష్ట్రంలోని ప్రముఖ పట్టణాల్లో బిక్షాటన చేయిస్తున్నారనీ, ఇలా వచ్చిన డబ్బులు పౌండేషన్ యాజమాన్యాలు తీసుకుంటున్నార న్నారు. ఉపాధి కల్పిస్తామని చెప్పి బిక్షాటన చేయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బోడుప్పల్, మేడిపల్లి, పిర్జాదిగూడ, నారపల్లి, బాలాజీ నగర్, నాచారంలతో పాటు ఎల్బీనగర్, హయత్నగర్ ప్రాంతాల్లో కూడా అనేక ఫౌండేషన్ లు ఉన్నాయన్నారు. స్వయం ఉపాధి వృత్తి శిక్షణ పేరుతో ఫౌండేషన్ను ఏర్పాటు చేసి అమాయక వికలాంగులను మోసం చేసి బిక్షాటన చేయిస్తున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టంసెక్షన్ 52 (ఏ), 51 (3)(ఏ) ప్రకారం ఫౌండేషన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2016 సెక్షన్ 91 ప్రకారం వికలాంగులను ఉపయోగించుకుని లబ్ది పొందడం చట్టరీత్యా నేరం అన్నారు. ఉన్నత చదువులు చదివిన వికలాంగులకు ఉపాధి చూపిస్తామని ఆశ చూపి ఆలయాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్ దగ్గర చౌరస్తాలో బిక్షాటన చేయిస్తూ రూ.లక్షలు సంపాదిస్తున్నా రని తెలిపారు. వికలాంగులు బిక్షాటన చేయగా వచ్చిన డబ్బులలో ఫౌండేషన్ యాజమాన్యాలు వాటాలు పంచుకుంటూ వికలాంగులు మోసం చేస్తున్నాయన్నారు. హైదరాబాద్ నడిబొడ్డులోనే పౌండేషన్ల పేరుతో పెద్ద మాఫియా నడుస్తుందన్నారు. ఫౌండేషన్ ముసుగులో దోపిడీకి పాల్పడుతున్న యాజమాన్యాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఫౌండేషన్ను పర్యవేక్షిం చాల్సిన అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఫౌండేషన్ నిర్వాకంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రంగారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రమోహన్, షాహిన్ బేగం, జిల్లా కార్యదర్శి కె.వెంకట్, సహాయ కార్యదర్శి జె.మల్లేష్, నాయకులు బుచ్చమ్మ, వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.