Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
రోజురోజుకూ ఒమిక్రాన్ వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. బషీర్‌బాగ్‌లోని పోలీస్ కమిషనరేట్‌లో మంగళవారం అదనపు సీపీ డీఎస్.చౌహాన్, డీసీపీ డి.సునీతారెడ్డితో కలిసి తనిఖీలు నిర్వహించారు. ప్రతి విభాగాన్ని పరిశీలించారు. గదుల్లో వెంటిలేషన్‌ను పెంచాలనీ, పరిమిత స్థలంలో సామాజిక దూరాన్ని పాటించాలన్నారు. తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని సూచనలు చేశారు. గుంపులుగా టీ తాగడం, మధ్యాహ్న భోజనం చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కమిషనరేట్ పరిధిలోని పోలీసు స్టేషన్లు, వివిధ విభాగాల నుంచి కమిషనర్ కార్యాలయానికి వచ్చే పోలీసు సిబ్బందిని కూడా నియంత్రించనున్నట్టు తెలిపారు. వీలైనంత వరకు ఆన్లైన్లో సేవలను అందిస్తామన్నారు. సందర్శకుల కోసం ఉద్దేశించిన ఫర్నీచర్‌కు రంగులు వేయాలనీ, మరుగుదొడ్లు, వాష్‌రూమ్‌లను శుభ్రంగా ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శానిటైజర్, మాస్క్‌లు తదితర వాటిని కొనుగోలు చేసి పంపిణీ చేసేందుకు నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. సోషల్ మీడియా వింగ్, కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను కూడా సందర్శించి, క్షేత్రస్థాయిలో వాస్తవంగా పని చేస్తున్న సీసీటీవీల సంఖ్య, సీపీ కార్యాలయంలో పర్యవేక్షిస్తున్న వివిధ ఐటీ ప్రాజెక్టుల స్థితిగతులపై ఆరా తీశారు. విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ సూచించారు.