Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట్
శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం మంత్రి వివిధ శాఖల అధికారులతో కలిసి బన్సీలాల్ పేట డివిజన్ భోలక్పూర్, కృష్ణానగర్ కాలనీలలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు కొందరు మాట్లాడుతూ తమ బస్తీలో కొందరు యువకులు గంజాయి సేవించి వచ్చి రాత్రి వేళల్లో రోడ్లపై కూర్చొని వచ్చి పోయే వారితో ఘర్షణ పడటం, పార్కింగ్ చేసి ఉన్న వాహనాలను ధ్వసం చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని మంత్రికి ఫిర్యాదు చేశారు. స్పందించిన మంత్రి అన్ని బస్తీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలనీ, రాత్రి వేళ పెట్రోలింగ్ నిర్వహించాలని గాంధీ నగర్ పోలీసులను ఆదేశించారు. అక్రమంగా రోడ్లపై రోజుల తరబడి నిలిపిన వాహనాలతో ఇబ్బందులు పడుతున్నట్టు మంత్రి దృష్టికి తీసుకు రాగా వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు ప్రభాకర్ రెడ్డిని ఆదేశించారు. బస్తీలోకి భారీ వాహనాలు రాకుండా చూడాలని మంత్రి చెప్పారు. అనంతరం భోలక్పూర్, కృష్ణానగర్ బస్తీలో కాలినడక తిరిగి పర్యటించారు. మ్యాన్ హొల్స్ నుంచి తొలగించిన పూడికను తరలించకుండా ఉండటంతో వెంటనే తరలించాలని వాటర్ వర్క్స్, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఎప్పుడో వేసిన డ్రయినేజీ పైప్ లైన్ కావడం వల్ల తరచూ ఓవర్ ప్లో అయి మురుగు నీరు రోడ్లపైకి వస్తుందని స్థానిక ప్రజలు మంత్రికి వివరించారు. నూతన పైప్ లైన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వాటర్ వర్క్స్ అధికారి రమణా రెడ్డిని ఆదేశించారు. ఎవర్ గ్రీన్ ఫ్రెండ్స్ అసోసియేషన్ పక్కన రోడ్డులో ఫుట్ పాత్ ఆక్రమణలను తొలగించి రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట కార్పొరేటర్ హేమలత, పద్మారావు నగర్ పార్టీ ఇన్చార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, సుదర్శన్, వాటర్ వర్క్స్ రమణా రెడ్డి, టౌన్ ప్లానింగ్ క్రిస్టోఫర్, నాయకులు వెంకటేష్ రాజు, ఏసూరి మహేష్, శ్రీనివాస్ యాదవ్, శ్రీకాంత్, లావణ్య, తదితరులు పాల్గొన్నారు.