Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
సంక్రాంతి పండుగ సమయంలో తెలుగు రాష్ట్రాల్లో బస్సులు, రైళ్లు కిటకిటలాడుతున్నాయి. సొంత ఊర్లకు ప్రయాణించే వారితో బస్స్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఇప్పటికే రద్దీగా మారాయి. ఇక ఇదే సమయంలో విపరీతంగా ధరలు పెంచి ప్రయివేట్ బస్సులు దందాకు తెరలేపాయి. పండుగ పది రోజుల ముందు నుంచే టికెట్ల ధరను పెంచే ప్రయివేట్ బస్సు ఆపరేటర్లు అందినకాడికి దండుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే అలాంటి వాళ్లకు చెక్ పెట్టడానికి రవాణాశాఖ అధికారులు రంగంలోకి దిగారు. నిబంధనలకు విరుద్ధంగా, సరైన పర్మిట్లు లేకుండా, ప్రయాణీకుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తూ.. పొరుగు రాష్ట్రాల మధ్య తిరుగుతున్న ప్రయివేటు ట్రావెల్స్ వాహనాలపై నజర్ పెట్టిన అధికారులు గడిచిన నాలుగు రోజులుగా హైదరాబాద్ శివార్లలో పలుచోట్ల తనిఖీలను చేపట్టారు. ఇందులో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న పలు బస్సులపై కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానా విధించారు. ఈ దాడులను ఈనెల 17 వరకు కొనసాగించనున్నారు.
టికెట్ ధరలు పెంచిన ట్రావెల్స్‌పై కొరడా
సంక్రాంతి సమయంలో టికెట్ ధరలను మరింతగా పెంచేయడం వీలైనంతగా దండుకోవడం రొటీన్‌గా ప్రతి సంక్రాంతి సీజన్లో జరుగుతుంది. ఇక ఈసారి కూడా పండుగ సందర్భంగా కూడా విపరీతంగా టికెట్ల ధరలను పెంచి ప్రయివేట్ ట్రావెల్స్ సొమ్ము చేసుకునే పనిలో నిమగమైంది. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లాలనే ప్రయాణికుల నుంచి అందినకాడికి దోచుకోవడానికి ప్రయివేటు ట్రావెెల్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో రవాణా శాఖ ఉన్నతాధికారులు ఈ వ్యవహారాలపై దృష్టి సారించారు. భారీగా టికెట్ ధరలు పెంచిన ట్రావెల్స్‌పై కొరడా ఝుళిపిస్తున్నారు.
42 బస్సులపై కేసులు.. రూ. 67వేల పెనాల్టీ వసూలు
సంక్రాంతి సందర్భంగా నగరం ఖాళీ అవుతుంది. తెలంగాణ, ఏపీ వాసులంతా తమ సొంత ఊర్లకు వెళ్తుంటారు. హైదరాబాద్ నుంచి ఏపీకి భారీ ఎత్తున ప్రయివేటు బస్సులు తిరుగుతాయి. హైదరాబాద్ నగరం నుంచి ప్రతిరోజు తెలంగాణలోని ఇతర జిల్లాలతో పాటు ఏపీకి సుమారు 900 ప్రయివేటు బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇందులో చాలా బస్సులు కాంట్రాక్ట్ క్యారియర్ కింద నమోదు చేసుకుని స్టేజీ క్యారియర్ల కింద తిప్పుతున్నాయి. ముఖ్యంగా ధనార్జనే లక్ష్యంగా ఇవి నడుస్తు న్నాయి. ఇదేకాకుండా ప్రయాణికుల భద్రతకు సంబంధించి నిబంధనలను ప్రయివేటు ఆపరేటర్ల యాజమాన్యాలు పట్టించు కోవడం లేదు. అగ్నిప్రమాద నిరోధక చర్యలు లాంటి కనీస జాగ్రత్తలు సైతం తీసుకోవడంలేదు. వీటికితోడు అగ్నిమాపక యంత్రాలు లేకుండా వందల కి.మీ. మేర బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇదేకాక పండుగ వేళ ప్రయాణీకుల రద్దీని ఆసరాగా చేసుకుని ఎడాపెడా చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఇలాంటి వాళ్లకు చెక్ పెట్టేందుకు ఆర్టీఏ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. ఇష్టారాజ్యంగా టికెట్ల ధరలు పెంచిన, నిబంధనలు పాటించని 42 బస్సులపై కేసులు నమోదు చేయగా.. రూ.67 వేల జరిమానా వసూలు చేసినట్టు రవాణాశాఖ ఉన్నతాధికారులు తెలిపారు.