Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-వివాహితపై కత్తితో విచక్షణారహితంగా దాడి
-భయాందోళనతో పరుగులు పెట్టిన స్థానికులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఎర్రగడ్డలో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండంగా ఓ వివాహితపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన సంచలనం రేపింది. పోలీసుల వివరాల మేరకు శ్రీకాకుళానికి చెందిన డి.శ్యామల, సూర్యనారాయణ భార్యాభర్తలు. ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చిన దంపతులు ఎర్రగడ్డలో నివాస ముంటున్నారు. పెళైన ఏడాదికి తొలి సంతానంలో బాబు, ఆ తర్వాత పాప పుట్టింది. ఆడపిల్ల పుట్టిందన్న కారణంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో 2009లో సూర్యనారాయణ ఇళ్లు వదిలి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి శ్యామల పిల్లలతో కలిసి నివాసముంటుంది. ఈ క్రమంలో 2016లో ఎర్రగడ్డ సుల్తాన్ నగర్‌కు చెందిన సైకిల్ మెకానిక్ సయ్యద్ ఖలీల్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇదిలా వుండగా 2017లో హోటల్లో పనిచేసే శ్రీశైల్ కోట్తో శ్యామలకు పరిచయం ఏర్పడటంతో అతన్ని వివా హం చేసుకుంది. విషయాన్ని దాచిపెట్టిన శ్యామల అప్పుడ ప్పుడు ఖలీల్‌ను కలిసేంది. రెండో పెండ్లి విషయాన్ని తెలుసుకున్న ఖలీల్ ఆమెను నిలదీశాడు. దాంతో అప్పటి నుంచి ఖలీల్‌ను దూరం పెట్టింది. కక్షపెంచుకున్న ఖలీల్ ఎలాగైనా హత్యచేయాలని నిర్ణయించుకుని అదునుకోసం ఎదురు చూస్తున్నాడు. పథకంలో భాగంగా గత ఆదివారం ఎర్రగడ్డలోని సండే మార్కెట్లో రెండు కత్తులను కొనుగోలు చేశాడు. మంగళవారం రోడ్డుపై వెళ్తున్న శ్యామ లను అనుసరించాడు. వెంట తెచ్చుకున్న కత్తితో ఒక్కసారి గా ఆమె గొంతు, మెడపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ప్రాణాలు కాపాడుకునేందుకు బాధితురాలు రోడ్డుపై పరుగులు తీసింది. అయితే తీవ్ర రక్తస్రావం కావడంతో కొద్ది దూరంలోనే కుప్పకూలిపోయింది. గాయాలతో కదల్లేక ఉన్న అమె చనిపోయిందని భావించిన ఖలీల్ అక్కడి నుంచి పరారయ్యాడు.
భయాందోళనతో పరుగులు
దాడి ఘటనను ప్రత్యేక్షంగా చూసిన స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. కొందరు ఇండ్లల్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. నిందితుడు అక్కడి నుంచి వెళ్లిన తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. 108కు ఫోన్ చేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తం మడుగులో వున్న బాధితురాలిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. స్థానికంగా వున్న సీసీ పుటేజీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీమ్‌లను రంగంలోకి దించారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలను సేకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇదిలా వుండగా ఖలీల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. తనను శ్యామల దూరం పెట్టడమే కాకుండా, తనకు చెప్పకుండా మరో పెండ్లి చేసుకోవడంతోనే తాను దాడికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో నిందితుడు చెప్పినట్టు తెలుస్తోంది.