Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న 317 జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలి
-ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షులు పోలాడి రామారావు
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగ నియామకాలను వెంటనే చేపట్టి వయో పరిమితి దాటిపోతున్న నిరుద్యోగులను ఆదుకోవాలని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షులు, రైతు ఉద్యమ నేత పోలాడి రామారావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఓసీ సమాఖ్య ఆధ్వర్యంలో మంగళవారం బషీర్‌బాగ్‌లోని రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ నియామకాల్లో వివిధ వర్గాలకు వయోపరిమితి సడలింపు ఇస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయం అయినప్పటికీ, గత కొన్నేండ్లుగా నియామక ప్రక్రియ జరగకపోవడంతో వయోపరిమితి సడలింపు వయస్సు దాటిపోతామనే ఆందోళన నిరుద్యోగ వర్గాల నుంచి వ్యక్తమవుతోందన్నారు. తెలంగాణలో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల ఆందోళనకు కారణమైన, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న 317 జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ వర్గాల స్థానికత నిర్ధారణ కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ జీవో అమలుకు సీనియారిటీతో మెలిక పెట్టడంతో ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా జరుగుతున్న ఈ బదిలీలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆరోపించారు. ఆదివాసీలకు రక్షణ కల్పించే ఐదో షెడ్యూల్ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకుండా బదిలీలు చేపట్టడం, ఆ వర్గాలకు నష్టం కలిగించే పరిణామమన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల ఆందోళనలు దష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం వారికి మేలు చేసే విధంగా తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరారు. సమావేశంలో ఓసీ సమాఖ్య జాతీయ సలహాదారులు పెండ్యాల కేశవరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు చెన్నమనేని పురుషోత్తమరావు, ప్రధాన కార్యదర్శి గోపు జయపాల్ రెడ్డి, నాయకులు తీగల లక్ష్మణ్ రావు, అండెం రమణారెడ్డి, జేడీ వాసు, జి.అంజయ్య, సారాబుడ్ల రాజిరెడ్డి, మ్యాదరి తిరుపతిరెడ్డి, ఉన్నం అంజయ్య, ఎర్రం నారాయణరెడ్డి, తోట శ్రీనివాస్, కాల్వ నర్సయ్య, చకిలం రాజేశ్వర్ రావు, రాధారపు సంజీవరెడ్డి పాల్గొన్నారు.