Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-మానవ హక్కుల కమిషన్ చైర్మెన్ జస్టిస్ చంద్రయ్య
-తెలుగువర్సిటీ కీర్తిపురస్కారాల ప్రదానం
నవతెలంగాణ-అంబర్‌పేట
తెలుగు అన్ని రంగాల్లో విస్తరించాలని మానవ హక్కుల కమిషన్ చైర్మెన్ జస్టిస్ చంద్రయ్య అన్నారు. మంగళవారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాల యంలో నిర్వహించిన కీర్తిపురస్కారాల ప్రదానోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ కాలంలో ఏర్పాటైన యూనివర్సిటీ తెలుగు లలితకళలు, కవులు, రచయితలకు ప్రోత్సాహం కల్పిస్తోందని అన్నారు. కోర్టులు, న్యాయస్థానాలతో సహా అన్ని రంగాల్లో తెలుగు విస్తరించాలని ఆకాంక్షించారు. యూనివర్సిటీ ఇచ్చే ఈ పురస్కారాలు అవార్డు గ్రహీతల జీవితంలో ప్రతిష్టాత్మకమైనవని చెప్పారు.
విశిష్ట అతిథిగా హాజరైన మాజీ వీసీ ప్రొఫెసర్ సులేమాన్ సిద్ధిఖీ మాట్లాడుతూ కళలను, వివిధ రంగాల ప్రముఖులను సత్కరించడం దక్కన్ సంస్కృతిలో భాగమని గత 12వ శతాబ్ధం నుంచి ఇది ఆనవాయితీగా వస్తోందన్నారు. దక్కన్‌ను పరిపాలించిన యాదవ, కాకతీయ, అసఫ్‌జాహీ, నిజాం తదితర రాజవంశాల కాలంలో నాటి పరిస్థితులను వివరించారు. వీసీ ప్రొఫెసర్ తంగెడ కిషన్‌రావు మాట్లాడుతూ అవార్డు గ్రహీతల్లో తన సహచరులు, తాను విద్యాబోధనలు చేసిన వాళ్లు ఉండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ ప్రతిభను గుర్తించి పురస్కారాలు అందించే కార్యక్రమాన్ని కొనసాగిస్తుందన్నారు. ఈ సందర్భంగా జీవిత చరిత్ర విభాగంలో వెలుగు జర్నలిస్ట్ మరిపాల శ్రీనివాస్, సృజనాత్మక సాహిత్యంలో కోడూరి పుల్లారెడ్డి, పరిశోధన విభాగంలో శ్రీకాంత్‌కుమార్, ఆధ్యాత్మిక సాహిత్యంలో మూడభూషి శ్రీధర్, బాలసాహిత్యంలో వాసరవేణి పరశురాములు, అనువాద సాహిత్యంలో మూడ్ కృష్ణనాయక్, పత్రిక రచనలో రాజశుక, వ్యక్తిత్వ వికాసంలో గంపానాగేశ్వర్ తదితర వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 23మందికి కీర్తిపురస్కారాలను అందించి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ భట్టు రమేష్, నిర్వహణ మండలి సభ్యులు డాక్టర్ రాఘవ రాజ్‌భట్, విస్తరణ విభాగం ఇన్చార్జి రాంమూర్తి పాల్గొన్నారు.