Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఫస్ట్, సెకండ్ వేవ్‌ల కంటే కొవిడ్ కేసులు అధికంగా నమోదయ్యే అవకాశముందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతికి ముందు, తర్వాత పరిశీలిస్తే కేసుల సంఖ్య క్రమంగానే పెరుగుతోంది. రాష్ట్రలో 20 లక్షల మందికి కరోనా లక్షణాలు ఉంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 12 లక్షల మందికి లక్షణాలు ఉన్నాయని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. వారం రోజులుగా 1000కిపైగా కేసులు నమోదవుతున్నాయి.
వేగంగా..
కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుంది. పరీక్షల కోసం జనం ఆస్పత్రుల వద్ద బారులు తీరుతున్నారు. ముఖ్యంగా వైద్యారోగ్యశాఖలోని డాక్టర్లు, వైద్య సిబ్బందితోపాటు బ్యాంకు అధికారులు, పోలీసులకు భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే 500మందికిపైగా డాక్టర్లకు పాజిటివ్ వచ్చినట్టు సమాచారం. బ్యాంకుల్లోనూ, పోలీసు స్టేషన్లోనూ కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణ సచివాలయం (బీఆర్కే భవన్)లో 20మందికిపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 10మందికిపైగా వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు జీహెచ్ఎంసీ పరిధిలో వారం రోజులుగా 1000కిపైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. బుధవారం 1474, మంగళవారం 1206, సోమవారం 1112, ఆదివారం1174, శనివారం 1075, శుక్రవారం 1233, గురువారం 1328 పాజిటివ్ కేసులు వచ్చాయి.
ఫీవర్‌సర్వే..
జీహెచ్ఎంసీ పరిధిలో వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నారు. ఎక్కువ మందికి జ్వరంతోనే కరోనా ప్రారంభమవుతుందని వైద్యులు చెబుతున్నారు. కొంత మందికి మాత్రం లక్షణాల్లేకుండానే పాజిటివ్ వస్తోందంటున్నారు. ఈ తరుణంలో మాస్క్ తప్పని సరిగా ధరించాలనీ, భౌతికదూరం పాటించాలలని సూచిస్తున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నారు.