Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తప్పు చేస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధం పొట్లూరి వరప్రసాద్
నవతెలంగాణ-బంజారాహిల్స్
ఎవరి బెదిరింపులకు బెదిరేది లేదు అని, తప్పు చేస్తే చట్టపరమైన శిక్షణకు సిద్ధం అని పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) అన్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర నాయకులు డీకే అరుణ కూతురు శతి రెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తనపై నమోదైన కేసులపై ఆయన స్పందించారు. నాలుగు వారాలుగా తాను కుటుంబంతో గోవాలో ఉన్నామనిచ తనపై, తన సిబ్బందిపై కేసు పెట్టినట్లు ఇప్పుడే తెలిసిందన్నారు. 'మేము తప్పు చేసి ఉంటే మమ్మల్ని, నా సిబ్బందిని, తరిమి తరిమికొట్టండని'అన్నారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 7లోని తాను కొనుగోలు చేసిన విల్లాలో డీకే అరుణ కుమార్తె శతి రెడ్డి ఇంట్లోకి ప్రవేశించి ఆమె సొంతగా నిర్మించుకున్న ప్రహరీ గోడతో పాటు రేకులను సైతం పీవీపీ అనుచరుడు బాలాజీ మరికొందరితో కలిసి జేసీబీతో ధ్వంసం చేయించారు. అయితే దీనిపై ప్రశ్నించిన శతిరెడ్డిని బెదిరింపులకు గురి చేసినట్టు తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పీవీపీతోపాటు సంఘటన స్థలంలో ఉన్న బాలాజీ అతనికి సహకరించిన మరికొందరిపై కేసు నమోదు చేశారు. కాగా గతంలో పీవీపీ తన రియల్ కంపెనీ ద్వారా ప్రేమ్ పర్వత్ విల్లాస్ అనే వెంచర్ వేసి వాటిని అమ్ముకున్నారు. అయితే విల్లాలు కొనుగోలు చేసిన వారు తమకు అనుకూలంగా ఇంటిని మార్చుకుంటుండడంతో ఆయన అడ్డుకుంటున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలా రెండేండ్ల కిందట కూడా రెనోవేషన్ చేసుకుంటున్న ఇంట్లోకి ప్రవేశించి ఆ ఇంటిని కూలగొట్టినట్టు కేసు నమోదైంది. కాగా ఆ కేసు విచారణకు వెళ్లిన పోలీసులపైకి ఆయన కుక్కల్ని వదలడంతో ఆ కేసు సైతం వివాదస్పదమైంది. దీంతో ఆకేసులో ముందస్తు బెయిల్ తెచ్చుకోవడంతో కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. తాజాగా అదే తరహాలో కేసు నమోదు కావడంతో ఆయన స్పందించారు.