Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్‌పేట
రాష్ట్ర ప్రభుత్వం కరోనా కారణంగా పాఠశాలలను మూసేయడం అంటే దేశాన్ని నాశనం చేయడమేనని ఆలిండియా ప్రిన్సిపాల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మాహమ్మద్ సుజాద్దిన్ అన్నారు. శుక్రవారం మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపల్లోని కొత్తపేటలో గల సక్షెస్ స్కూల్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోవిడ్-19 కారణంగా సంక్రాంతి సెలవులు ఈ నెల 30వ తేదీ వరకు పొడిగింపు నిర్ణయాన్ని గౌరవిస్తామన్నారు. అదే సమయంలో ప్రభుత్వ ఆదేశాలను కూడా అనుసరిస్తామనీ, బాధ్యతాయుతమైన విద్యావేత్తగా, మన దేశం ఎదుర్కోబోయే ప్రమాదం గురించి ఉన్నతాధికారులను అప్రమత్తం చేయడం మా కర్తవ్యం అన్నారు. పాఠశాలలను మూసివేయడం అంటే రాబోయే తరాల భవిష్యత్తుతో ఆడుకోవడం అని తాము నమ్ముతున్నామని పేర్కొన్నారు. ఆరోగ్య శాఖ, డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం కరోనా పిల్లలపై తేలికపాటి ప్రభావాన్ని చూపుతుందనీ, పాఠశాలలను మూసివేయడం పరిష్కారం కాదన్నారు. 18 నెలల కాలంలో కరోనా సెలవుల్లో చిన్నారులు తమ అభ్యాసాన్ని ఎంతగానో కోల్పోయారని తెలిపారు. విద్యను నేర్చుకోవడం మాత్రమే కాకుండా వారి శారీరక, మానసిక ప్రవర్తనను కూడా ప్రతికూలంగా ప్రభావితం చేసిందన్నారు. 4-5 నెలల్లో పాఠశాల ఉపాధ్యాయులు, యాజమాన్యం విద్యార్థుల అభ్యాస అంతరాలను పూడ్చేందుకు చాలా కృషి చేశారనీ, ఇప్పుడు విద్యార్థులు తమ చదువులతో సమానంగా ఉన్నారన్నారు. ప్రభుత్వం అకస్మాత్తుగా 20 రోజుల పాటు సెలవులను పొడిగించడం నేర్చుకునే ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుందన్నారు. చివరికి విద్యార్థులలో నిష్క్రియాత్మకతకు దారి తీస్తుందనీ, అందువల్ల సాధారణ మహమ్మారి మార్గదర్శకాలతో తమకు పాఠశాలలను నడపడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. తదుపరి సెలవులను పొడిగించవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయులు, విద్యార్ధులు, తదితరులు పాల్గొన్నారు.