Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
ఆరోగ్య తెలంగాణే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమనీ, రాష్ట్రంలో ఫీవర్ సర్వేను వారం రోజుల్లో పూర్తి చేస్తామని సీఎస్ సోమేశ్ కుమార్ అన్నారు. శుక్రవారం ఖైరతాబాద్ డివిజన్ పరిధిలోని చింతల్ బస్తీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గాంధీతాతనగర్, హిల్‌టాప్ కాలనీల్లో సర్వే తీరును సీఎస్ సోమేశ్ కుమార్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు. సర్వే సమయంలో కొవిడ్ లక్షణాలు ఉన్నట్టు గుర్తిస్తే అక్కడికక్కడే బాధితులకు మెడిసిన్ కిట్లు అందజేస్తున్నట్టు తెలిపారు. ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్నా పెద్దగా లక్షణాలు కనిపించడం లేదన్నారు. త్వరలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు. అవసరమైన వారికి టెస్టులు నిర్వహిస్తున్నారనీ, కొవిడ్ లక్షణాలుంటేనేనే టెస్టు చేయాలని ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్ ఉన్నాయని తెలిపారు. వైద్య, ఆరోగ్యశాఖ ప్రతి రోజూ లక్షకు పైగా కొవిడ్ నిర్ధారణ టెస్టులు చేస్తోందన్నారు. ప్రజలు భయపడాల్సిన పని లేదనీ, కోటి హోం ఐసోలేసన్ కిట్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఇంటింటి సర్వే, కొవిడ్ టెస్టుల నిర్వహణ, వ్యాక్సినేషన్లో వైద్య సిబ్బంది పనితీరు బాగుందనీ, కష్టపడి పని చేస్తున్నారని కొనియాడారు. సర్వే సందర్భంగా వైద్య సిబ్బంది ఐసోలేషన్ కిట్ అందజేయడం, అవసరమైన వారికి టీకా ఇవ్వడం, గర్భిణులకు వైద్య సాయం అందించడం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులతో కలిపి మొతం 56 వేల బెడ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. బూస్టర్ డోస్ కొనసాగుతోందనీ, ఇప్పటికే 70శాతం వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకట్, ఖైరతబాద్ జోనల్ కమిషనర్ రవి కుమార్, డీఎంసీ వంశీ కృష్ణ, ఏఎంహెచ్ఓ భార్గవ్ నారాయణ, యూసీడీ అధికారి దామోదర్ రెడ్డి, డాక్టర్ సంధ్య, నర్సులు, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు, జీహెచ్ఎంసీ సిబ్బంది పాల్గొన్నారు.
లక్షణాలుంటేనే టెస్టులు : మేయర్
కరోనా లక్షణాలుంటేనే టెస్టులు తప్పనిసరిగా చేయించుకోవాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వ్ా విజరు లక్ష్మి అన్నారు. శుక్రవారం బంజారాహిల్స్ డివిజన్ పరిధిలోని ఎన్బీటీ నగర్లో ఫీవర్ సర్వేను మేయర్ పర్యవేక్షించారు. అవసరమైన వారికి మెడిసిన్ కిట్టును అందజేశారు. వ్యాక్సిన్ వేసుకోని వారు వేసుకోవాలని ఈ సందర్భంగా మేయర్ సూచించారు. గతంలో రెండుసార్లు ఫీవర్ సర్వే నిర్వహించారని గుర్తు చేశారు. ఆర్టీపీసీఆర్ టెస్టుకు ప్రయివేట్ ఆస్పత్రులు, ల్యాబుల్లో రూ.500 మాత్రమే తీసుకోవా లనీ, ఎవరైనా ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. 60 ఏండ్లు పైబడిన వారందరూ బూస్టుర్ డోస్ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ 18 డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, ఏఎంహెచ్‌వో రవికాంత్, డిప్యూటీ డీఎంహెచ్‌వో అనురాధ, డాక్టర్లు సీమా రెహమాన్, బస్తీ దావఖాన డాక్టర్లు జ్యూస్‌ని, జీహెచ్ఎంసీ సిబ్బంది, ఆశావర్కర్లు, శానిటేషన్ ఏఈ రజిత, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
కంటోన్మెంట్ పరిధిలో....
కంటోన్మెంట్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ప్రాంతంలో ఐదో వార్డు, మారేడ్‌పల్లి మండల పరిధిలోని సంజీవయ్యనగర్, వీకర్ సెక్షన్ కాలనీలో 60 బృందాలతో చేపట్టిన ఫీవర్ సర్వేను జిల్లా కలెక్టర్ శర్మన్ పరిశీలించారు. ఎమ్మార్వో సునీల్, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.