Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రక్షణ గోడలు కంచె లేని వైనం
పొంచి ఉన్న ప్రమాదం
పట్టించుకోని విద్యుత్‌శాఖ అధికారులు
నవతెలంగాణ-అడిక్‌మెట్
ముషీరాబాద్ నియోజకవర్గంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ కంచె, ఫ్యూజు బాక్స్‌లకు మూతలు లేనందున ఏ క్షణంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని సర్వత్రా ఆందోళన నెలకొంది. పిల్లలు ఆడుకుంటూ అటువైపుగా వెళ్తే విద్యుత్ షాక్‌కు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రజలు వాపోతున్నారు. కేవలం విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ట్రాన్స్ఫార్మర్ల పరిస్థితి ఈ విధంగా ఉందని ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారుల దష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని చెబుతున్నారు.
అడిక్‌మెట్ డివిజన్లోని రాంనగర్‌గుండు, మదర్స్కూల్, పార్సిగుట్ట తదితర ప్రాంతాల్లో వాహనదారులు అదుపుతప్పి వాహనాలు నేరుగా ట్రాన్స్ఫార్మర్ వైపు వెళ్లడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. రాంనగర్ మదర్ స్కూల్ గేటు వద్ద ట్రాన్స్ఫార్మర్కు కంచె లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అలాగే కొన్ని చోట్ల ఫ్యూజ్బాక్స్లు శిథిలావస్థలో ఉండటం, మరికొన్ని చోట్ల వాటికి మూతలు లేకపోవడంతో ప్రమాదాలకు స్వాగతం పలుకుతున్నాయి.
రక్షణ కంచెల ఏర్పాటు అవసరం
ముషీరాబాద్ నియోజకవర్గంలోని ట్రాన్స్ఫార్మర్లకు నాణ్యతతో కూడిన రక్షణ కంచెలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అడిక్‌మెట్ డివిజన్లోని లక్ష్మమ్మ పార్క్, మేడి బారు బస్తీలోని రామాలయం వద్ద ప్రమాదకరంగా ట్రాన్స్ఫార్మర్ ఉండడం వల్ల అటు వైపు వచ్చే పాదచారులు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో నాగమయ్య కుంట పరిధిలో ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ల వైర్ల వల్ల పలువురు మత్యువాతపడ్డారు. పలుచోట్ల అవి కిందికి ఉండడంతో బాటసారులకు, వాహనదారులకు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదానికి గురయ్యే పరిస్థితి ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ కంచె నిర్మించి శిథిలావస్థకు చేరిన బాక్సులను తొలగించి కొత్తవాటిని ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.