Authorization
Fri March 21, 2025 07:15:37 pm
జీహెచ్ఎంసీ తీరుపై మండిపడ్డ
తారాసింగ్ కుటుంబం
నవతెలంగాణ-బంజారాహిల్స్
వివాదం చెలరేగి న్యాయస్థానం స్టే విధించిన స్థలంలో జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ నిర్మాణాలు చేపట్టడం ఏమిటని రహమత్‌నగర్‌కు చెందిన తారాసింగ్ కుటుంబం వాపోయింది. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో న్యాయవాది జస్బీర్తో కలిసి మాట్లాడారు. సోమాజిగూడ రాజ్ భవన్ రోడ్లో (6-3-1238/6/ఏ) 650 గజాల స్థలం ఉందని, 2000లో సత్తమ్మ అనే మహిళ వద్ద సదరు స్థలాన్ని తమ కుటుంబం కొనుగోలు చేసిందని చెప్పారు. ఇంటిపై న్యాయపరమైన చిక్కులు ఏర్పడడంతో తాము హైకోర్టును ఆశ్రయించామని తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం యథాతథ స్థితి(స్టే)ని కొనసాగించాలని 2012లో ఆదేశాలు జారీ చేసిందని వివరించారు. అయితే గత 15 రోజుల నుంచి జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అక్రమంగా సదరు స్థలంలో ప్రవేశించి నిర్మాణాలు ప్రారంభించిందని తెలిపారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేస్తూ నిర్మాణాలు చేయడం తగదని, నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి వెళ్లగా తమను అకారణంగా నెట్టివేశారని తెలిపారు. ఈ విషయంపై తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించగా స్టే ఉన్న స్థలంలోకి ఎవరు ప్రవేశించకుండా చూడాలని ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.