Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
రైల్వే శాఖ, మెట్రో రైల్ శాఖల్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేస్తున్న ముఠాలోని ముగ్గురు నిందితులను ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఫేక్ ఐడీ కార్డులు, మూడుకార్లు, సెల్ఫోన్లతోపాటు ఫేక్ అపాయింట్మెంట్ పేపర్లు తదితర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం కమిషనరేట్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో రాచకొండ సీపీ మహేష్‌భగవత్ వివరాలను వెల్లడించారు. గుంటూరుకు చెందిన కె.సురేంత్ర తన భార్య నాగలక్ష్మితోపాటు ఉప్పల్‌లో నివాసముంటున్న డి.సురేష్, ఖమ్మంకు చెందిన కె.భాగ్య లక్ష్మి, శ్రీనివాస్‌రావు, సికింద్రాబాద్‌కు చెందిన ఆలామ్లు కలిసి ఏర్పాడ్డారు. సులువుగా డబ్బులు సంపాదించాలని నిరుద్యోగులను టార్గెట్ చేశారు. ప్రధాన నిందితుడు కె.సురేంద్ర 2013లో హైదరాబాద్‌కు వచ్చి కార్డ్రైవర్గా పనిచేశాడు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో పుట్టసురేష్ రెడ్డిగా చెలామణి అవుతూ ఉప్పల్‌లో నివాసమున్నాడు. నకిలీ పత్రాలు సమర్పించి ఆధార్‌కార్డు, ప్యాన్‌కార్డు తదితర పత్రాలపై పుట్టసురేష్ రెడ్డిగా మార్చుకున్నాడు. నాగోల్, ఉప్పల్‌లో వివిధ బ్యాంక్‌లలో ఖాతాలు తెరిచాడు. సులువుగా డబ్బులు సంపాదించాలని అతని భార్యతో కలిసి ప్లాన్ చేశాడు. రైల్వేశాఖలో, మెట్రో రైళ్లలో ఉద్యోగాలున్నాయని స్నేహితుడైన శ్రీనివాస్‌రావు, ఆలామ్కు చెప్పాడు. వారి సహాయంతో మరో ముగ్గురితో కలిసి ముఠాను ఏర్పాటు చేశాడు. ఎటువంటి ప్రవేశ పరీక్షలు లేకుండానే ఉద్యోగాలిప్పిస్తామంటూ ప్రచారం చేశారు. బాధితులను నమ్మించేందుకు సికింద్రాబాద్‌లోని రైల్‌నిలయానికి తీసుకొచ్చి వారి పత్రాలను పరిశీలించేవారు. ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేశారు. డబ్బులిచ్చిన వారికి నకిలీ అపాయింట్ ఆర్డర్లు ఇచ్చారు. అయితే వాటిని తీసుకుని కొందరు నిరుద్యోగులు రైల్వే అధికారులను సంప్రదించడంతో అసలు విషయం వెలుగు చూసింది. సురేంద్రపై గతంలో ఖమ్మంలో కేసులున్నాయి. తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానంటూ స్నేహితులను మోసం చేశాడు. తెలిసిన వారి నుంచి రూ.12లక్షలు వసూలు చేసి పరారయ్యాడు. తాజాగా రూ.2 కోట్ల వరకు వసూలు చేశాడు. వచ్చిన డబ్బులతో సురేంద్ర బోడుప్పల్లో ఫ్లాట్‌తోపాటు కార్లు కొనుగోలు చేశాడు. పరారీలోవున్న ఆలామ్, శ్రీనివాస్‌రావు, కె.భాగ్యలక్ష్మి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సమావేశంలో డీసీపీలు రక్షితామూర్తి, యాదగిరి, ఏసీపీ శ్యామ్‌ప్రసాద్, ఇన్స్పెక్టర్ నవీన్‌కుమార్, జి.గోవర్దనగిరి, ఎస్ఐ సందీప్‌తోపాటు మాల్కాజ్‌గిరి ఎస్వోటీ, మేడిపల్లి పోలీసులు పాల్గొన్నారు.