Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు అనేది వజ్రాయుధం అని మేడ్చల్-మల్కాజిగిరి అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును పండుగలా నిర్వహించాలని, ఈ విషయంలో యువత ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. మంగళవారం 12వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్ చాంబర్ నుంచి జిల్లాలోని ఈఆర్వోలతో గూగుల్ మీటింగ్ ద్వారా మాట్లాడారు. ఓటు హక్కు ప్రాధాన్యతను అందరికీ తెలియజేసేందుకు 25 జనవరి 2011 నుంచి జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటు వేయడం బరువుగా కాకుండా బాధ్యతగా తీసుకొని మంచి సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేయాలని కోరారు. మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఇటీవల కొత్తగా ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకొన్న 7,558 మందికి ఎపిక్ కార్డులను అందజేశారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా జిల్లావ్యాప్తంగా ఆయా పాఠశాల్లో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్, చిత్రలేఖన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.ఎస్.ఎస్.వి. ప్రసాద్‌తో కలిసి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, ఏఓ వెంకటేశ్వర్లు, జిల్లా ఎన్నికల సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు.