Authorization
Fri March 21, 2025 02:45:12 pm
నవతెలంగాణ-కాప్రా
ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణ కోసం నిరంతర పోరాటం చేస్తామని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. ఎస్. బోస్ అన్నారు. ఫిబ్రవరి 5,6,7 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు ఏఐటీయూసీ జాతీయ సమితి సమావేశాల గోడ పత్రికను మంగళవారం ఈసీఐఎల్‌లోని నీలం రాజశేఖర్ రెడ్డి భవన్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేట్‌పరం చేయడం ద్వారా కార్పొరేట్ శక్తుల ఆస్తులు విపరీతంగా పెరిగాయ ధ్వజమెత్తారు. కార్పొరేట్ శక్తుల ఆస్తులు, ఆదాయం మీద ప్రభుత్వ నియంత్రణ ఉండాలని, వారి ఆస్తులను జాతీయం చేయాలని డిమాండ్ చేశారు. జనవరి 26న గణతంత్ర వేడుకల్లో పాలకుల మాటల గారడీని ప్రజలు జాగ్రత్తగా గమనించాలన్నారు. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ చేసే ప్రగల్భాలను తిప్పికొట్టాలని, దుర్మార్గపు చర్యలపై ప్రజలంతా సంఘటిత పోరాటాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 5,6,7 తేదీల్లో జరిగే జాతీయ సమావేశాల్లో 15 డిమాండ్స్‌పై నిర్దిష్టంగా చర్చలు జరపనున్నట్టు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర, ఏఐటీయూసీ ఈసీఐఎల్ కంపెనీ మాజీ ప్రధాన కార్యదర్శి నర్సింహా, నాయకులు జీవీఆర్వీ ప్రసాద్, ఆర్. జోషి కుమార్, ఈ. బాలకృష్ణ, అజరు కుమార్, బి. ప్రవీణ్, పవన్, గంధాలు తదితరులు పాల్గొన్నారు.