Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమంలో తెలంగాణ పితామహుడు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ పాత్ర గొప్పదని పలువురు వక్తలు అన్నారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రముఖ సోషలిస్టు, తెలంగాణ ఉద్యమ నాయకులు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ 90వ జయంతి సభ లోహియా విచార్ మంచ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా జాదవ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మాట్లాడుతూ పేదల పక్షాన సామాజిక న్యాయం కోసం చివరి వరకు జాదవ్ పోరాడారని అన్నారు. ఆయన ఆలోచనలు ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి మాట్లాడుతూ 1952 నాన్ మూల్కీగో బ్యాక్ ఉద్యమాన్ని నిర్వహించిన వారిలో జాదవ్ ముఖ్య పాత్ర పోషించారన్నారు. 1956 తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడమేకాకుండా, 1975 ఎమర్జెన్సీ సమయంలో 18 నెలలపాటు జైలు జీవితాన్ని అనుభవించాడని గుర్తు చేశారు. మెదక్లో ఇందిరా గాంధీపై, కరీంనగర్ ఉప ఎన్నికలో కేసీఆర్పై పోటీచేశారన్నారు. పాఠ్య పుస్తకాలల్లో జాదవ్ జీవిత చరిత్ర పెట్టాలన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ బాలకిషన్, బి.కిషన్ లాల్, దామోదర్ రెడ్డి, డి.శంకర్, శశికుమార్, సుభద్రరెడ్డి పాల్గొన్నారు.