Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఖైరతాబాద్ జోన్‌లోని లంగర్ హౌస్ చెరువు క్లీనింగ్, బ్యూటిఫికేషన్ పనులను చేపట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి అధికారులను ఆదేశించారు. గురువారం తన ఛాంబర్లో జోనల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లతో లంగర్‌హౌస్ వద్ద చేపట్టే పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. లంగర్ హౌస్ చెరువు హుడా పార్కు ప్రాంతంలో అపరిశుభ్రంగా ఉన్నట్టు ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. సుందరీకరణ పనులు చేపట్టాలని ఆదేశించారు. లంగర్ హౌస్ చెరువులో ప్రవహిస్తున్న మురుగునీటి ద్వారా పేరుకుపోతున్న గుర్రపుడెక్క ద్వారా దోమల పునరుత్పత్తి అధికంగా జరుగుతోందన్నారు. దోమల బెడద నివారణ, చెరువు నుంచి వెదజల్లే దుర్వాసనలు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. బ్యారేజ్, ఫ్లోటింగ్ ట్రాష్ కలెక్టర్ ఎఫ్‌టీసీ అమర్చి గుర్రపుడెక్కను యుద్ధప్రాతిపదికన నిర్మూలించాలని చెప్పారు. ఎంటమాలజీ శాఖ ద్వారా చెరువులో యుద్ధ ప్రాతిపదికన యాంటీ లార్వా యాక్టివిటీస్, ఫాగింగ్ నిరంతరాయంగా చేపట్టాలన్నారు. లంగర్ హౌస్ చెరువువద్ద హుడా పార్కు సుందరీకరణలో భాగంగా మంచి సువాసన వెదజల్లే మొక్కలు నాటాలని సూచించారు. మస్కిటో రిపెల్లెంట్ ప్లాంట్లు చెరువుకు ఇరువైపులా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సిటీలోని అన్ని చెరువుల్లోనూ దోమల నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. శానిటేషన్, హెల్త్ అడిషనల్ కమిషనర్ సంతోష్ మాట్లాడుతూ... ఇప్పటివరకు 39 చెరువులలో అధిక స్థాయిలో ఉన్న గుర్రపు డెక్కను గుర్తించామని, 31 చెరువులలో దానిని తొలగించే పనులను చేపట్టామని తెలిపారు. ఈ సమావేశంలో చీఫ్ ఎంటమాలజిస్ట్ రాంబాబు, ఎస్ఈ. కోటేశ్వరరావు, ఈఈ రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.