Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాల విషయంలో మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ విభాగం ముమ్మర చర్యలు చేపడుతుండగా.. బిల్డింగ్ యజమానులు మాత్రం తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. ప్రారంభ దశలోనే బోడుప్పల్ కార్పొరేషన్ నగర ప్రణాళిక విభాగం అధికారులు నిలువరించి ఉంటే ఇంత మొత్తంలో నష్టపోయే అవకాశం ఉండేది కాదని కూల్చివేతలకు గురైన సదరు బిల్డింగ్‌ల యజమానులు వాపోతున్నారు. నిర్మాణ దశలో తాము స్థానిక ప్రజా ప్రతినిధులను కలిసి తణమో ఫణమో సమర్పించుకున్నామనీ, మొత్తం పూర్తయ్యాక అధికారులు వచ్చి కూల్చివేతలు చేపట్టడంతో తమకు తీవ్రమైన నష్టం వాటిల్లిందని మీడియాతో వాపోయారు. ఇందులో ఒక్కో షెడ్‌కు రూ.యాబై వేల నుంచి రూ.3 లక్షల వరకు స్థానిక ప్రజాప్రతినిధులకు ఇచ్చామనీ, అయినా తమకు కూల్చివేతలతో తీవ్రమైన నష్టం ఏర్పడిందని బాధితులు తమ గోడును వెల్లబోసుకున్నారు. ఇదిలా ఉండగా.. టీఎస్ బీ పాస్ నిబంధనలు పాటించకుండా ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలపై కఠిన చర్యలు తప్పవని బోడుప్పల్ మున్సిపల్ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్ అన్నారు. రెండో రోజు శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ విభాగం అధికారుల నేతృత్వంలో అనుమతులు లేకుండా చేపట్టిన పలు కమర్షియల్ షెడ్లను, భవంతులను జేసీబీల సాయంతో నేలమట్టం చేశారు. ఇప్పటికైనా నిర్మాణాలు చేపట్టేవారు ఖచ్చితంగా టీఎస్ బీపాస్ చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకుని అనుమతులు పొందిన అనంతరమే నిర్మాణాలు చేపట్టాలని కోరారు. ఈ కూల్చివేతల్లో జిల్లా టాస్క్ ఫోర్స్ విభాగం అధికారులు, మేడిపల్లి, ఘటకేసర్ మండలాల ఆర్ఐలు, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
ముడుపులు ముట్టిన ప్రజాప్రతినిధుల సంగతేంటి ?
తమ తమ డివిజన్లలో చేపడుతున్న నిర్మాణాల విషయాలను పసిగట్టి నిర్మాణదారుల బలహీనతలను ఆసరాగా చేసుకుని స్థానిక ప్రజాప్రతినిధులు నేరుగా లేదా తమ అనుచరుల ద్వారా ఒత్తిడిలు తెచ్చి మరీ వసూళ్లు చేశారు. నిర్మాణం పూర్తి కావాలంటే నాకు ఇంత మొత్తంలో డబ్బులు కావాలంటూ డిమాండ్ చేసినట్లు ఎన్నో సందర్భాల్లో ఆరోపణలు వచ్చాయి. తీరా నేడు జిల్లా అధికారులు స్పందించి అనుమతులు లేని నిర్మాణాలపై ఉక్కుపాదం మోపడంతో రెండు రకాలుగా నష్టపోయిన యజమానులు లబోదిబోమంటూన్నారు. ప్రజాప్రతినిధులుగా రాజ్యాంగంపై ప్రమాణం చేసి ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పి, తప్పుదోవ పట్టించిన ప్రజాప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకోవాలని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.